IND vs AUS 5th Test: బీజీటీ సిరీస్ కోల్పోయిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఖతం.. ఐదో టెస్టులో ఓటమి.. పదేళ్ల తర్వాత
IND vs AUS 5th Test: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో భారత్ ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్‍కు సమర్పించేసింది. ఐదో టెస్టు మూడో రోజే టీమిండియా పరాజయం పాలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు కూడా ముగిసిపోయాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని టీమిండియా కోల్పోయింది. గత నాలుగుసార్లుగా ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ టైటిల్ గెలుస్తూ వచ్చిన భారత్.. ఈసారి చతికిలపడింది. ఆసీస్ గడ్డపై 1-3 తేడాతో సిరీస్ ఓడిపోయింది టీమిండియా. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో మూడు రోజైన నేడు (జనవరి 5) 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆసీస్ చేతిలో భారత్‍కు పరాజయం ఎదురైంది. సుమారు రెండున్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ ఐదు టెస్టుల సిరీస్‍ను గెలుపుతో ఆరంభించిన భారత్.. ఆ తర్వాత విఫలమైంది. 3-1తో సిరీస్ కైవసం చేసుకొని పదేళ్ల తర్వాత బీజీటీ టైటిల్ దక్కించుకుంది ఆసీస్.
సునాయాసంగా ఛేదించిన ఆస్ట్రేలియా
ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 162 పరుగుల టార్గెట్ ఇచ్చింది భారత్. నేడు మూడో రోజు ఆటకు 6 వికెట్లకు 141 పరుగుల వద్ద బరిలోకి దిగింది టీమిండియా. మరో 16 పరుగులే జోడించి రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. తొలి సెషన్‍లో కాసేపటికే చాపచుట్టేసింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఈ మ్యాచ్‍లో మొత్తంగా 10 వికెట్లు దక్కించుకున్నాడు.
162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (41), సామ్ కొన్‍స్టాస్ (22) దూకుడుగా ఆడారు. లక్ష్యాన్ని త్వరగా కరిగించే ప్రయత్నం చేశారు. వీరు ఔటయ్యాక మార్నస్ లబుషేన్ (6), స్టీవ్ స్మిత్ (4) త్వరగా పెవిలియన్ చేరటంతో భారత్ జట్టులో ఆశలు చిగురించాయి. అయితే, ట్రావిస్ హెడ్ (34 నాటౌట్), అరంగేట్ర ప్లేయర్ వెబ్‍స్టర్ (39 నాటౌట్) దీటుగా ఆడారు. మరో వికెట్ పడకుండా ఆసీస్‍ను గెలుపు తీరం దాటించారు. 4 వికెట్లకు 162 పరుగులు చేసి మూడో రోజు విజయం సాధించింది ఆస్ట్రేలియా. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు, మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశారు. కెప్టెన్ బుమ్రా గాయం వల్ల బౌలింగ్ చేయలేకపోవడం పెద్ద మైనస్ అయింది. ఈ సిరీస్‍లో 32 వికెట్లు తీసిన బుమ్రాకే.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
పదేళ్ల తర్వాత..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత నాలుగుసార్లు వరుసగా దక్కించుకుంది భారత్. 2016-17 నుంచి 2022-23 మధ్య నాలుగుసార్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు బీజీటీ 2024-25 సిరీస్‍లో ఓడింది. పదేళ్ల తర్వాత ఆసీస్‍పై ఓ టెస్టు సిరీస్‍లో ఓటమి పాలైంది. 10 సంవత్సరాల తర్వాత బీజీటీ టైటిల్ గెలిచింది ఆసీస్. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత ఆధిపత్యం ముగిసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఎండ్
ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 సైకిల్‍లో టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలువాలంటే తప్పక గెలువాల్సిన ఈ మ్యాచ్‍లో భారత్ ఓడిపోయింది. దీంతో 2021, 2023లో గత రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్.. ఈసారి అర్హత సాధించలేకపోయింది. ఇక, ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ఆస్ట్రేలియా అర్హత సాధించింది. దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరుతో తలపడనుంది ఆసీస్.
సంబంధిత కథనం