Ind vs Aus 4th Test: యశస్వి జైస్వాల్ రనౌట్‌పై లైవ్‌లో మాటామాటా అనుకున్న టీమిండియా మాజీ క్రికెటర్లు.. అది కోహ్లి తప్పా?
Ind vs Aus 4th Test: యశస్వి జైస్వాల్ రనౌట్ పై లైవ్ టీవీ చర్చలో టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ మాటా మాటా అనుకున్నారు. ఇందులో తప్పెవరిది అన్నదానిపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
Ind vs Aus 4th Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట చివరి 25 నిమిషాల్లో టీమిండియా తడబడింది. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. అయితే దీనికి కారణమైన యశస్వి జైస్వాల్ రనౌట్ పై టీమిండియా మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టార్ స్పోర్ట్స్ లైవ్ చర్చలో ఈ ఇద్దరూ ఇందులో తప్పెవరిది అన్నదానిపై మాటా మాటా అనుకోవడం గమనార్హం.
యశస్వి రనౌట్‌లో తప్పెవరిది?
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో ఇండియా 2 వికెట్లకు 153 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అప్పటికే కోహ్లి, యశస్వి 102 పరుగులు జోడించారు. ఈ సమయంలో లేని పరుగు కోసం ప్రయత్నించి 82 పరుగుల దగ్గర యశస్వి ఔటయ్యాడు. జైస్వాల్ బంతిని మిడాన్ లో ఉన్న ప్యాట్ కమిన్స్ చేతుల్లోకి కొట్టి వెంటనే పరుగు కోసం ప్రయత్నించాడు.
నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కోహ్లి బాల్ నే చూస్తూ.. యశస్విని గమనించలేదు. ఆలోపే యశస్వి సగం పిచ్ దాటేసి వచ్చాడు. కమిన్స్ వెంటనే బంతిని వికెట్ కీపర్ వైపు విసరడం, అతడు రనౌట్ కావడం జరిగిపోయాయి. ఇందులో కోహ్లి తప్పు ఉందని మంజ్రేకర్, ఎలా అవుతుందని ఇర్ఫాన్ పఠాన్ లైవ్ లో మాటల యుద్ధానికి దిగారు.
ఇర్ఫాన్ వర్సెస్ మంజ్రేకర్
మంజ్రేకర్ మొదట ఏమన్నాడంటే.. "కోహ్లి మరీ స్కూల్ పిల్లాడిలాంటి తప్పు చేశాడు. బంతి వైపు చూస్తూ పరుగు లేదని నిర్ణయించడం తప్పు. అది నాన్ స్ట్రైకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. అది ఆ బంతిని ఆడిన బ్యాటర్ నిర్ణయమే. ఒకవేళ జైస్వాల్ తప్పుగా పరుగెత్తి ఉంటే అప్పుడు కమిన్స్ నాన్ స్ట్రైకర్ వైపు బంతి విసిరేవాడు. జైస్వాల్ ఔటయ్యేవాడు. కానీ కోహ్లి నో చెప్పాడు. యశస్వికి మరో అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో నా అభిప్రాయం ఇది" అని అన్నాడు.
దీనిపై పఠాన్ స్పందిస్తూ.. "క్రికెట్ లో మరో నిజం కూడా ఉంది. ఒకవేళ బంతిని పాయింట్ వైపు ఆడితే నాన్ స్ట్రైకర్ పరుగు తీయాలో వద్దో చెప్పొచ్చు. స్ట్రైకర్ వద్దని వద్దని వారించవచ్చు. కొన్నిసార్లు నో కూడా చెప్పొచ్చు" అని అన్నాడు. కానీ ఇర్ఫాన్ అని మంజ్రేకర్ ఏదో చెప్పబోతున్నా ఇర్ఫాన్ అలాగే మాట్లాడుతుండటంతో చెప్పింది నువ్వు వినకపోతే చెప్పడానికేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొత్త కోచింగ్ మాన్యువల్ రిలీజ్ చేయాల్సిన టైమ్ వచ్చిందని, వికెట్ల మధ్య పరుగు ఎలా ఉండాలో ఇర్ఫాన్ చెబుతున్నాడంటూ మంజ్రేకర్ వ్యంగ్యంగా మాట్లాడాడు.
దీంతో ఇటు ఇర్ఫాన్ కూడా కాస్త ఇబ్బందిగానే నవ్వుతూ చర్చ కొనసాగించాడు. అయితే దీనిపై ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ రనౌట్ టీమిండియా కొంప ముంచింది. అప్పటి వరకూ పటిష్టంగా ఉన్న టీమ్.. తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయి.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 164 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా 310 పరుగులు వెనుకబడే ఉంది. రిషబ్ పంత్, జడేజా క్రీజులో ఉన్నారు.