IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్ - తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన టీమిండియా - రోహిత్, కోహ్లిలది మళ్లీ పాత కథే!
IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడింది. రెండో రోజు ముగిసే సమయానికి 46 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 82 పరుగులతో రాణించగా...కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ విఫలమయ్యారు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కంటే 310 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులతో దారుణంగా విఫలం కాగా...కోహ్లి, కేఎల్ రాహుల్ భారీ స్కోర్లు చేయలేకపోయారు.
రోహిత్ మూడు పరుగులు...
బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండు రోజు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా తిరిగి బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి టీమిండియా స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న తరుణంలోనే రాహుల్‌ను కమిన్స్ బోల్తా కొట్టించాడు. 42 బాల్స్‌లో మూడు ఫోర్లతో రాహుల్ 24 పరుగులు చేసి రాహుల్ ఔటయ్యాడు.
కోహ్లి...జైస్వాల్ కలిసి...
ఆ తర్వాత కోహ్లి, జైస్వాల్ కలిసి టీమిండియా స్కోరును నూట యాభై పరుగులు దాటించారు. గత టెస్టుల్లో చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని కోహ్లి సంయమనంతో ఆడాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీకి చేరువ అయిన జైస్వాల్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 118 బాల్స్‌లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఓవర్‌లోనే కోహ్లిని బోలాండ్ పెవిలియన్‌కు పంపించాడు. మరోసారి ఆఫ్‌సైడ్ బంతిని ఆడటంతో తడబడిన కోహ్లి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన ఆకాష్ దీప్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. ఆరు పరుగులు వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా.
స్మిత్ సెంచరీ….
ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరు రన్స్, రవీంద్ర జడేజా నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు.అంతకుముందు 311 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్మిత్ సెంచరీతో (140 పరుగులు) రాణించాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు, జడేజా మూడు వికెట్లు దక్కించుకున్నాడు.