IND vs AUS 4th Test Result: అనూహ్యంగా ఓడిన టీమిండియా.. చివరి సెషన్‍లో కుప్పకూలి ఆసీస్ చేతిలో పరాజయం.. యశస్వి పోరాడినా..
IND vs AUS 4th Test Result: నాలుగో టెస్టులో టీమిండియాకు షాకింగ్ పరాజయం ఎదురైంది. చివరి రోజు ఆఖరి సెషన్‍లో వికెట్లు టపటపా కోల్పోయి ఓటమి పాలైంది. దీంతో సిరీస్‍లో ఆసీస్ ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచినా ఆ తర్వాత కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. మెల్‍బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆఖరు రోజైన నేడు (డిసెంబర్ 30) భారత్ 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. టీ విరామం వరకు మూడు వికెట్లే కోల్పోయి పటిష్టంగా ఉన్న భారత్.. చివరి సెషన్‍లో ఆఖరు 34 పరుగులకు ఏడు వికెట్లు చేజార్చుకొని 155 పరుగులకే ఆలౌటైంది.
పంత్ అనవసర షాట్.. టపాటపా వికెట్లు
భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84 పరుగులు; 8 ఫోర్లు) అద్భుతంగా పోరాడాడు. రిషబ్ పంత్ (104 బంతుల్లో 30 పరుగులు) ఉన్నంతసేపు నిలకడగా ఆడాడు. అయితే, మూడో సెషన్‍లో ఆసీస్ పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‍లో పంత్ అనవసరమైన షాట్‍కు వెళ్లి ఔటయ్యాడు. డ్రా కోసం నిదానంగా ఆడాల్సిన దశలో బంతిని గాలిలోకి బాది క్యాచౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీంతో ఆసీస్ గెలుపు ఆశలు మళ్లీ చిగురించాయి. యశస్వి జైస్వాల్ ఔట్‍పై థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. జైస్వాల్ వెనుదిరగడంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా చివరి సెషన్‍లో 22 ఓవర్లలోపే 34 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది భారత్. రెండో సెషన్‍లో వికెట్ పడకుండా ఆడి డ్రా ఖాయమనుకున్న దశ నుంచి ఓటమి పాలైంది. 340 పరుగుల లక్ష్యఛేదనలో అనూహ్యంగా కుప్పకూలి.. షాకింగ్ పరాజయం పొందింది.
రోహిత్, విరాట్ మళ్లీ విఫలం.. రాహుల్ డకౌట్
ఐదో రోజు ఆరంభంలోని నాథన్ లియాన్ (41)ను భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేశాడు. మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం నిలిచింది.
లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (40 బంతుల్లో 9 పరుగులు) విఫలమయ్యాడు. త్వరగానే ఔటయ్యాడు. వెంటనే కేఎల్ రాహుల్ (0) డకౌట్‍గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ (5) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. దీంతో 33 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
రెండో సెషన్‍లో నో వికెట్
వికెట్లు పడుతున్నా భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడాడు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. రిషబ్ పంత్ కూడా తన శైలికి భిన్నంగా డిఫెన్స్ ఆడాడు. మ్యాచ్‍ను డ్రా చేసేందుకు ఇద్దరూ నిదానంగా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ బౌలర్లను అడ్డుకున్నారు. దీంతో రెండో సెషన్‍లో ఒక్క వికెట్ కూడా పడలేదు. జైస్వాల్ అర్ధ శతకం చేశాడు.
కుప్పకూలిన భారత్
టీ విరామ సమయానికి 3 వికెట్లకు 112 పరుగులు చేసింది భారత్. దీంతో ఇక డ్రా ఖాయం అని అందరూ అనుకున్నారు. గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ చివరి సెషన్‍లో పార్ట్ టైమ్ బౌలర్లకు బంతి ఇచ్చింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ట్రావిస్ హెడ్ బౌలింగ్‍లో పంత్ అర్థం లేని షాట్ కొట్టి ఔటయ్యాడు. దీంతో ఆసీస్‍కు గెలుస్తామనే నమ్మకం వచ్చింది. రవీంద్ర జడేజా (2), గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి (1) వెనువెంటనే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ కూడా కాసేపటికే వెనుదిరిగాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఆకాశ్ దీప్ (7), జస్‍ప్రీత్ బుమ్రా (0), మహమ్మద్ సిరాజ్ (0) ఎక్కువసేపు నిలువలేదు. దీంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (45 బంతుల్లో 7 పరుగులు) నిలిచినా ఫలితం లేకపోయింది. 184 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్కాట్ బోల్యాండ్ తలా మూడు వికెట్లతో రాణించారు. నాథన్ లయాన్ రెండు, స్టార్క్, హెడ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‍లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్లు మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టు 2025 జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియాకు టెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్ ఆశలు కాస్త సజీవంగా ఉంటాయి.
ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 369 పరుగులు సాధించింది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలి అద్భుత శతకం చేసి టీమిండియాను ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 రన్స్ చేయగా.. భారత్ 155 పరుగులకు ఆలౌటైంది.
సంబంధిత కథనం