IND vs AUS 4th Test: ఆసీస్ టాప్‍ను దెబ్బకొట్టినా.. లోయర్ ఆర్డర్‌ను కూల్చలేకపోయిన భారత్.. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా..
IND vs AUS 4th Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్లను వణికించిన భారత బౌలర్లు.. లోయర్ ప్లేయర్లను కుప్పకూల్చలేకపోయారు. ఆసీస్ చివరి వికెట్ తీయలేక తంటాలు పడ్డారు. నాలుగో రోజు ముగిసే సరికి ఆసీస్ 333 పరుగుల ఆధిక్యం వద్ద ఉంది. ఆట ఎలా సాగిందంటే..
భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలి అద్భుత శతకం చేయడంతో పుంజుకున్న టీమిండియాకు గెలుపు ఆశలు చిగురించాయి. మెల్‍బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజైన నేడు (డిసెంబర్ 29) తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు భారత్ ఆలౌటైంది. 358/9 ఓవర్ నైట్ స్కోరుతో నేడు టీమిండియా బరిలోకి దిగగా సెంచరీ హీరో నితీశ్ (114) కాసేపటికే ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు వణికించి వికెట్ల టపటపా తీశారు. అయితే లోయర్ ఆర్డర్‌ను పడగొట్టలేకపోయారు. నాలుగో రోజు ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 9 వికెట్లకు 228 పరుగులు చేసింది. 333 పరుగుల ఆధిక్యం సాధించింది. ఏం జరిగిందంటే..
అదరగొట్టిన బుమ్రా, సిరాజ్
రెండో ఇన్నింగ్స్‌కు బ్యాటింగ్‍కు దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వణికించారు. కట్టుదిట్టమైన స్వింగ్ బంతులతో కంగారు పెట్టేశారు. బుమ్రా నాలుగు వికెట్లతో మరోసారి అద్భుత ప్రదర్శన చేస్తే.. సిరాజ్ మూడు వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ముందుగా ఆసీస్ అరంగేట్ర బ్యాటర్ సామ్ కొన్‍స్టాస్ (8)ను అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు బుమ్రా. గత మ్యాచ్‍లో రెచ్చిపోయిన అతడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆసీస్.
ఆసీస్ టపటపా
ఉస్మాన్ ఖవాజా (21), స్టీవ్ స్మిత్ (13)లను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆసీస్ డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (1)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో టెస్టుల్లో 200 వికెట్ల మార్క్ చేరుకున్నాడు. మిచెల్ మార్ష్ (0), అలెక్స్ కేరీ (2)ని కూడా బుమ్రా వెనువెంటనే పెవిలియన్‍కు పంపాడు. టపటపా కంగారు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్.
లబుషేన్ పోరాటం
ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ (139 బంతుల్లో 70 పరుగులు) నిలకడగా ఆడాడు. అర్ధ శతకం చేశాడు. అయితే, అతడిని సిరాజ్ ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఆసీస్ త్వరగా ఆలౌట్ అవుతుందని అనుకున్నా కథ అడ్డం తిరిగింది.
తిప్పలు పడిన భారత బౌలర్లు.. కానీ
ఆస్ట్రేలియా టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను వణికించిన భారత బౌలర్లు.. లోయర్ ఆర్డర్‌ను కప్పకూల్చలేకపోయారు. మిచెల్ స్టార్క్ (5) రనౌట్ కాగా.. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (41) దుమ్మురేపాడు. వేగంగా పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ ఆధిక్యం పెరుగుతూ పోయింది. కమిన్స్ వికెట్‍ను జడేజా పడగొట్టాడు.
చివరి వికెట్‍ను తీయలేక..
9 వికెట్లు పడినా చివర్లో ఆసీస్ ప్లేయర్లు నాథన్ లయాన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) తీవ్రంగా పోరాడారు. ఆఖరి వికెట్ కోసం భారత బౌలర్లు తిప్పలు పడినా ఫలించలేదు. లయాన్, బోలాండ్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. టీమిండియాకు చిరాకు తెప్పించారు. ఆసీస్ ఆలౌట్ కాకుండా ఆడ్డుకున్నారు. చివరి వికెట్‍కు అజేయంగా 55 పరుగులు జోడించారు లయాన్, బోలాండ్. దీంతో చివరి వికెట్ తీయలేక టీమిండియా ఉసూరుమంది. దీంతో 9 వికెట్లకు 228 పరుగుల వద్ద నాలుగో రోజును ఆసీస్ ముగించింది. 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. రేపు (డిసెంబర్ 30) ఈ టెస్టు ఆఖరి రోజు జరగనుంది. ఈ సిరీస్ ప్రస్తుతం 1-1గా ఉంది. దీంతో ఈ నాలుగో టెస్టు చివరి రోజుపై తీవ్రమైన ఉత్కంఠ ఉంది.
మూడు క్యాచ్‍లు మిస్ చేసిన యశస్వి
టీమిండియా ఈ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ తప్పిదాలు చేసింది. మార్నస్ లబుషేన్ ఇచ్చిన రెండు క్యాచ్‍లను యశస్వి జైస్వాల్ నేలపాలు చేశాడు. లేకపోతే ముందుగానే లబుషేన్ వెనుదిరిగే వాడు. ఈ క్రమంలో యశస్విపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్యాటి కమిన్స్ క్యాచ్‍ను కూడా యశస్వి మిస్ చేశాడు. ఈ మూడు క్యాచ్‍లు వదలడం టీమిండియాకు ఎదురుదెబ్బగా మారింది. చివరి వికెట్ తీయాల్సిన సమయంలో సిరాజ్ కూడా తన సొంత బౌలింగ్‍లో చేతికి వచ్చిన క్యాచ్‍ను వదిలేశాడు. దీంతో ఆసీస్‍కు అదృష్టం కలిసి వచ్చింది. ఫీల్డింగ్ తప్పిదాలు భారత్‍కు తలనొప్పిగా మారాయి.
సంబంధిత కథనం