Ind vs Aus 4th T20I: కరెంటు బిల్లే కట్టని స్టేడియం.. ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టీ20 మ్యాచ్ అసలు జరుగుతుందా?
Ind vs Aus 4th T20I: ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టీ20 మ్యాచ్ అసలు జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ జరగాల్సిన రాయ్‌పూర్ లోని స్టేడియం కరెంటు బిల్లే కట్టకపోవడంతో కొన్ని చోట్ల అసలు కరెంట్ లేదు.
Ind vs Aus 4th T20I: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే రాయ్‌పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో కొన్ని చోట్ల అసలు కరెంటే లేదు.
దీనికి కారణం స్టేడియం నిర్వాహకులు గత 14 ఏళ్లుగా అసలు కరెంటు బిల్లే కట్టలేదంటే నమ్మగలరా? ఐదేళ్లుగా ఈ స్టేడియంలో అసలు కరెంటే లేకపోవడం గమనార్హం.
కోట్ల కరెంటు బిల్లు పెండింగ్
రాయ్‌పూర్ లో ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టీ20కి ఆతిథ్యమిచ్చే స్టేడియం ఏకంగా రూ.3.16 కోట్ల కరెంటు బిల్లు బాకీ పడింది. 2009 నుంచి అసలు బిల్లే కట్టలేదు. దీంతో ఐదేళ్ల కిందట ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ స్టేడియానికి కరెంటు సరఫరా నిలిపేసింది. అయితే తర్వాత చత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వినతి మేరకు తాత్కాలిక కనెక్షన్ ఇచ్చారు.
అది కూడా కేవలం ప్రేక్షకుల గ్యాలరీలకు మాత్రమే అందుబాటులో ఉంది. రాత్రి పూట ఫ్లడ్ లైట్లు మొత్తం జనరేటర్ల మీద నడవాల్సిందే. అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగే సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో స్టేడియానికి తాత్కాలికంగా ఉన్న కనెక్షన్ ను 200 కేవీ నుంచి 1000 కేవీకి పెంచాలని అక్కడి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కోరారు.
దీనికి అనుమతి లభించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. స్టేడియంలో అసలు కరెంటు లేదన్న విషయం 2018లో బయటకు వచ్చింది. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న మారథాన్ అథ్లెట్లు ఈ విషయాన్ని గుర్తించారు. అప్పుడే కోట్ల కరెంటు బిల్లు పెండింగ్ లో ఉందన్న విషయం కూడా తెలిసింది. ఈ స్టేడియాన్ని నిర్మించిన తర్వాత నిర్వహణను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటోంది.
అయితే మిగిలిన ఖర్చులను మాత్రం అక్కడి క్రీడాశాఖ చూసుకోవాల్సి ఉంది. కరెంటు బిల్లు విషయంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. కరెంటు కనెక్షన్ కోల్పోయిన తర్వాత కూడా రాయ్‌పూర్ లో మూడు అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగాయి. కానీ అవన్నీ జనరేటర్లతోనే నడిచాయి. ప్రతిసారీ తమకు ఇదో పెద్ద సమస్య అవుతోందని అక్కడి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు.