IND vs AUS Gabba Test: టీమిండియాను భయపెడుతోన్న గబ్బా స్టేడియం టెస్ట్ రికార్డులు - ఏడు మ్యాచుల్లో ఒకటే గెలుపు
Gabba Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ శనివారం నుంచి గబ్బా వేదికగా మొదలుకాబోతుంది. గబ్బా స్టేడియం టీమిండియాకు అంతగా అచ్చి రాలేదు. ఈ పిచ్‌పై భారత జట్టు ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచులు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే విజయం సాధించింది
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి మొదలుకాబోతుంది. ఈ మూడో టెస్ట్‌కు గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతున్నది. తొలి టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా రెండో టెస్ట్‌లో మాత్రం తేలిపోయింది.
బ్యాటర్లు విఫలం కావడంతో...
బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమికి సీనియర్ ప్లేయర్లు రోహిత్ వర్మ, విరాట్ కోహ్లి కారణమంటూ పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తోన్నారు. బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేయాలని పేర్కొంటున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో మూడో టెస్ట్‌లో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక్కటే గెలుపు...
గబ్బా పిచ్ రికార్డులు టీమిండియాను భయపెడుతోన్నాయి. ఇప్పటివరకు ఈ వేదికపై టీమిండియా ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఐదింటిలో ఓడిపోగా...ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకున్నది. ఓ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2021లో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించింది.
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ విరోచిత బ్యాటింగ్‌తో టీమిండియా గెలుపు బాట పట్టింది. గబ్బా పిచ్‌పై టీమిండియాకు ఇదే ఏకైక విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ పిచ్‌పై టీమిండియా అత్యధిక స్కోరు 409 (2003లో) పరుగులు కాగా...అత్యల్ప స్కోరు 58 రన్స్ కావడం గమనార్హం.
ఈ గబ్బా పిచ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా సౌరభ్ గంగూలీ నిలిచాడు. 2003లో జరిగిన టెస్ట్‌లో 196 బాల్స్‌లో 144 రన్స్ చేశాడు.
హయ్యెస్ట్ యావరేజ్ రిషబ్ పంత్ (112)
సెంచరీలు చేసింది వీళ్లే…
గబ్బా పిచ్‌పై ఇప్పటివరకు నలుగురు టీమిండియా క్రికెటర్లు మాత్రమే సెంచరీ చేశారు. సౌరభ్ గంగూలీ, మురళీ విజయ్, జై సింహా, సునీల్ గవాస్కర్ మాత్రమే శతకాలు నమోదు చేశారు.
గబ్బా పిచ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సులను (రెండేసి) శుభ్‌మన్ గిల్, శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ఉమేష్ యాదవ్ కొట్టారు.
గబ్బా పిచ్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌గా ఎర్రపల్లి ప్రసన్న నిలిచాడు. రెండు టెస్టుల్లో 8 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (ఇన్నింగ్స్‌లో) కూడా ప్రసన్న పేరు మీదనే ఉంది. 1968లో జరిగిన టెస్ట్‌లో 104 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఆ టెస్ట్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు ప్రసన్న.
ధోనీ రికార్డ్…
ఈ పిచ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శనను సిరాజ్, మదన్‌లాల్, జహీర్ ఖాన్, బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న మాత్రమే సాధించారు.
గబ్బా పిచ్‌పై ఒక్క మ్యాచ్‌లో అత్యధిక మందిని ఔట్ చేసిన టీమిండియా క్రికెటర్‌గా ధోనీ పేరిట రికార్డ్ ఉంది.
గబ్బా పిచ్‌పై హయ్యెస్ట్ పార్టనర్‌షిప్ రికార్డ్ వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీ పేరిట ఉంది. 2003 డిసెంబర్‌లో జరిగిన టెస్ట్‌లో ఐదో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
గబ్బా పిచ్‌పై సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రహానే, ఛటేశ్వర్ పుజారా ఎర్రపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంట్‌సర్కార్ రెండేసి మ్యాచ్‌లు ఆడారు.