Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టులో మరో వరల్డ్ రికార్డు.. తన రికార్డు తానే బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్
Ind vs Aus 2nd Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో మరో వరల్డ్ రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గతంలో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాయడం విశేషం.
Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టులో ఇండియన్ బ్యాటర్లు ఒక్కో పరుగు కోసం కిందామీదా పడగా.. ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ మాత్రం అలవోకగా సెంచరీ బాదేశాడు. అంతేకాదు ఈ సెంచరీతో ఓ వరల్డ్ రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. ఓ డేనైట్ టెస్టులో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు అది. గతంలోనూ ఇది అతని పేరిటే ఉండటం గమనార్హం.
ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు
టీమిండియా అంటేనే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్ మరోసారి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మరోసారి గుర్తు చేస్తూ.. అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో సెంచరీ బాదాడు. రెండో రోజు ఆటలో హెడ్ కేవలం 111 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. రెండేళ్ల కిందట ఇంగ్లండ్ పై 112 బంతుల్లో సెంచరీ చేసి నెలకొల్పిన తన రికార్డును తానే తిరగరాశాడు.
అడిలైడ్ లోనే 2022లో వెస్టిండీస్ తో జరిగిన మరో డేనైట్ టెస్టులోనూ హెడ్ 125 బంతుల్లో సెంచరీ చేశాడు. అడిలైడ్ లో అతనికిది మూడో సెంచరీ. రెండో రోజు తొలి సెషన్ లో స్మిత్ కేవలం 2 పరుగులకే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెడ్.. అలవోకగా ఇండియన్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇండియన్ పేసర్లను అటాక్ చేస్తూ ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా బౌలింగ్ లో ఆచితూచి ఆడినా.. హర్షిత్ రాణాను చితకబాదాడు.
78 పరుగుల దగ్గర లైఫ్
నిజానికి హెడ్ కు ఈ ఇన్నింగ్స్ లో ఓ లైఫ్ దొరికింది. అతడు 78 పరుగులు దగ్గర ఉన్న సమయంలో అశ్విన్ బౌలింగ్ లో ఓ షాట్ ఆడబోగా అది గాల్లోకి లేచింది. మిడాన్ లో ఉన్న సిరాజ్ ఆ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ మరుసటి ఓవర్లోనే హర్షిత్ రాణా బౌలింగ్ లో హెడ్ ఆడిన షాట్.. వికెట్ కీపర్ పంత్, రెండో స్లిప్ లో ఉన్న రోహిత్ మధ్యలో నుంచి వెళ్లిపోయింది.
ఆ సమయంలో ఫస్ట్ స్లిప్ లేకపోవడంతో హెడ్ బతికిపోయాడు. చివరికి సిరాజ్ బౌలింగ్ లోనే హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెడ్ 141 బంతుల్లోనే 17 ఫోర్లు, 4 సిక్స్ లతో 140 రన్స్ చేయడం విశేషం. అతని సెంచరీకి తోడు లబుషేన్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం లభించింది.
డేనైట్ టెస్టుల్లో వేగవంతమైన సెంచరీలు
ట్రావిస్ హెడ్ వర్సెస్ ఇండియా - 111 బంతులు
ట్రావిస్ హెడ్ వర్సెస్ ఇంగ్లండ్ - 112 బంతులు
ట్రావిస్ హెడ్ వర్సెస్ వెస్టిండీస్ - 125 బంతులు
జో రూట్ వర్సెస్ వెస్టిండీస్ - 139 బంతులు
అసద్ షఫీఖ్ వర్సెస్ ఆస్ట్రేలియా - 140 బంతులు