IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా - రోహిత్, శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ
IND vs AUS 2nd Test: ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
IND vs AUS 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం (నేడు) రెండో టెస్ట్ మొదలైంది. అడిలైడ్ వేదికగా జరుగుతోన్న ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
రెండో టెస్ట్ కోసం తుది జట్టులో టీమిండియా మూడు మార్పులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తండ్రిగా మారడంతో తొలి టెస్ట్‌కు రోహిత్ దూరమయ్యాడు. అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ తో పాటు గిల్, అశ్విన్ కూడా తుది జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురి రీఎంట్రీతో ధ్రువ్ జురేల్, దేవ్‌దత్ ఫడిక్కల్‌తో పాటు సుందర్ పెవిలియన్‌కు పరిమితమయ్యారు.
బ్యాటింగ్ లైనప్...
రోహిత్, గిల్ రీఎంట్రీతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారింది. రెండో టెస్ట్‌లో జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగబోతున్నాడు. భారత ఇన్నింగ్స్‌ను జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆరంభించబోతున్నారు.
బుమ్రాపైనే ఆశలు...
తొలి టెస్ట్‌లో అదరగొట్టిన బుమ్రాపైనే భారత్ బలంగా ఆశలు పెట్టుకుంది. రెండో టెస్ట్‌లో బుమ్రా జోరు చూపిస్తే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలంగా మారింది. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌తో పాటు కోహ్లి సెంచరీలతో అదరగొట్టారు.
ఒక్క మార్పు...
మరోవైపు ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో ఓ మార్పు చేసింది. హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ ఎంపికచేసింది. తొలి టెస్ట్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది.
టాస్ గెలిచిన టీమ్...
ఆడిలైడ్ టెస్ట్‌లో ఇప్పటివరకు తొలుత టాస్ గెలిచిన జట్టు ఎక్కువ సార్లు విజయం సాధించింది. డే అండ్ నైట్ టెస్టుల్లో ఇదే రిజల్ట్ వచ్చింది. ఇప్పటివరకు టీమిండియా నాలుగు పింక్ బాల్ టెస్టులు ఆడగా మూడింటిలో గెలిచింది. ఆడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్‌లోనే ఓడింది.
ఇండియా తుది జట్టు ఇదే...
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, శుభ్‌మన్ గిల్, అశ్విన్, బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా.
ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే...
ఉస్మాన్ ఖవాజా, మెక్‌స్వీనే, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్.