Ind vs Aus 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. ఆ ఇద్దరూ ఔట్.. మరో రెండు మార్పులు కూడా?
Ind vs Aus 2nd Test: ఆస్ట్రేలియాతో శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అడిలైడ్ లో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్, గిల్ తిరిగి రావడంతో ఇద్దరిపై వేటు తప్పదు. మరో రెండు మార్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Ind vs Aus 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా భారీ విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు అడిలైడ్ లో డేనైట్ పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ కు ఇండియన్ టీమ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తిరిగి రావడంతో రెండు మార్పులు పక్కాగా జరగనుండగా.. కేఎల్ రాహుల్ ఏ స్థానంలో ఆడతాడన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
రోహిత్, గిల్ ఇన్.. పడిక్కల్, జురెల్ ఔట్
ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అతడు మరోసారి తండ్రి కావడంతో కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. అటు శుభ్‌మన్ గిల్ గాయంతో ఆడలేదు. అయితే ఇప్పుడీ ఇద్దరూ రెండో టెస్టుకు తుది జట్టులోకి రానున్నారు. దీంతో తొలి టెస్టులో మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ ఇద్దరూ తప్పుకోనున్నారు. ఇది ముందుగానే ఊహించిందే అయినా.. రోహిత్ రాకతో తొలి టెస్టులో ఓపెనర్ గా రాణించిన కేఎల్ రాహుల్ ఇప్పుడా స్థానాన్ని అతనికి వదులుకోవాల్సిన పరిస్థితి.
ఇక మూడో స్థానంలో గిల్ ఉండటంతో అక్కడా చోటు లేదు. దీంతో రాహుల్ మరోసారి మిడిలార్డర్ లోనే బరిలోకి దిగాల్సి రావచ్చు. తాను ఏ స్థానంలో ఆడాలన్నది రోహిత్, గంభీర్ చెప్పినా.. దానిని బయటకు వెల్లడించబోనని రాహుల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఓపెనర్లు రోహిత్, యశస్వి.. మూడో స్థానంలో గిల్, నాలుగో స్థానంలో కోహ్లి, ఐదో స్థానంలో రిషబ్ పంత్ వస్తే.. రాహుల్ ఆరో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది.
మరో రెండు మార్పులు చేస్తారా?
తుది జట్టులో ఈ రెండు మార్పులైతే పక్కా. ఇవి కాకుండా మరో రెండు మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అడిలైడ్ పిచ్ కాస్త స్పిన్ కు కూడా అనుకూలించే అవకాశం ఉండటంతో సుందర్ స్థానంలో అశ్విన్, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.
అడిలైడ్ లో జరగబోయే పింక్ బాల్ డేనైట్ టెస్టు కావడంతో టీమ్ మరీ ఎక్కువ మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో డేనైట్ టెస్టు అంటే అంత సులువు కాదు. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా 12 డేనైట్ టెస్టులు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడిపోయింది. ఆ లెక్కన అడిలైడ్ లో టీమిండియాకు ఆస్ట్రేలియా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే ఛాన్స్ కచ్చితంగా ఉంది.
టీమిండియా తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, సిరాజ్, బుమ్రా