Ind vs Aus 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓపెనర్లు ఎవరో చెప్పేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమ్ షాకింగ్ నిర్ణయం
Ind vs Aus 2nd Test: ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఓపెనర్లు ఎవరో తేల్చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే టీమ్ నిర్ణయం కాస్త షాక్‌కు గురి చేసింది.
Ind vs Aus 2nd Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు గెలిచిన టీమిండియా.. ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి అడిలైడ్ లో డేనైట్ టెస్టు జరగబోతోంది. పెర్త్ లో బౌన్స్ పరీక్షను సమర్థంగా ఎదుర్కొన్న ఇండియన్ టీమ్ కు ఈ డేనైట్ టెస్టు మరో సవాలు. అయితే ఈ టెస్టులోనూ ఓపెనర్ గా కేఎల్ రాహులే రాబోతున్నట్లు కెప్టెన్ రోహిత్ తేల్చేశాడు.
రాహుల్, యశస్వి ఓపెనింగ్
పెర్త్ టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహులే రెండో టెస్టులోనూ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. రోహిత్ తిరిగి రావడంతో రాహుల్ మిడిలార్డర్ లో ఆడాల్సి వస్తుందని అందరూ భావించారు. కానీ రాహులే ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ స్పష్టం చేశాడు. గురువారం (డిసెంబర్ 5) మీడియాతో అతడు మాట్లాడాడు.
"రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. నేను మిడిలార్డర్ లో ఎక్కడైనా ఆడతాను" అని రోహిత్ చెప్పడం గమనార్హం. ఈ నిర్ణయం ఒకింత షాక్ కు గురి చేసింది. ఎందుకంటే కొన్నేళ్లుగా రోహితే ఓపెనింగ్ చేస్తూ వస్తున్నాడు. 2018లో చివరిసారి మిడిలార్డర్ లో ఆడిన అతడు.. ఆరేళ్ల తర్వాత మళ్లీ టాపార్డర్ స్థానాన్ని వదులుకున్నాడు.
రోహిత్ ఏ స్థానంలో ఆడతాడు?
కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ కన్ఫమ్ చేయడంతో ఇప్పుడతని స్థానం ఏంటన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ రానున్నాడు. దీంతో అక్కడా రోహిత్ కు ఛాన్స్ లేదు. నాలుగో స్థానంలో కోహ్లి వస్తే.. ఐదో స్థానంలోగానీ రోహిత్ కు అవకాశం ఉండదు. నిజానికి ఆ స్థానంలో రిషబ్ పంత్ కొన్నాళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ కోసం పంత్ ఒక స్థానం తగ్గాల్సి రావచ్చు. కెప్టెన్ కామెంట్స్ బట్టి చూస్తే.. రాహుల్, యశస్వి, గిల్, కోహ్లి, రోహిత్, రిషబ్.. బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పెర్త్ టెస్టులో రోహిత్ లేకపోవడంతో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ సక్సెసయ్యాడు. బ్యాటింగ్ కు ఎంతో కష్టంగా అనిపించిన పెర్త్ లో తొలి ఇన్నింగ్స్ లో 26 రన్స్ చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 77 రన్స్ చేశాడు. అటు యశస్వి రెండో ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ చేశాడు. దీంతో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనింగ్ కాంబినేషన్ ను చెడగొట్టకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేసి మిడిలార్డర్ కు పరిమితం కానున్నాడు. రోహిత్, గిల్ తప్ప మిగిలిన టీమ్ అంతా తొలి టెస్టులో ఆడిన వాళ్లతోనే నిండిపోనుంది.
తొలి టెస్టులో ఏకంగా 295 పరుగులతో గెలిచిన టీమిండియా ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే అడిలైడ్ లో డేనైట్ టెస్ట్ రూపంలో పెద్ద సవాలే ఎదురు కానుంది. ఎందుకంటే పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడం దాదాపు అసాధ్యమనేలా ఆ టీమ్ రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 12 డేనైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ఒక దాంట్లోనే ఓడింది. మరి అడిలైడ్ లో టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.