IND vs AUS 2nd T20: భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20కి వర్షం ముప్పు ఉందా? పిచ్, లైవ్ వివరాలివే..
IND vs AUS 2nd T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఆదివారం (నవంబర్ 26) జరగనుంది. ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం ఉంటుందా.. తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.
IND vs AUS 2nd T20: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో ఓటమి పాలైన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియాతోనే సొంతగడ్డపై ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన భారత్ జట్టు.. రెండో మ్యాచ్‍కు రెడీ అయింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఆదివారం (నవంబర్ 26) తిరువనంతపురంలోని గ్రీన్‍ఫీల్డ్ స్టేడియంలో జరగనుంది. చాలా మంది సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో యువకులతో భారత జట్టు కళకళలాడుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తొలి టీ20లో సత్తాచాటిన భారత్.. ఆసీస్‍ను మట్టికరిపించి సిరీస్‍లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం జరిగే రెండో టీ20లోనూ గెలిచి సత్తాచాటాలని టీమిండియా కసితో ఉంది. ఈ మ్యాచ్ వివరాలివే..
వర్షం ముప్పు ఎంత..
తిరువనంతపురంలో శనివారం వర్షం భారీగా కురిసింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరగాల్సిన గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నీరు నిలిచింది. అయితే, మ్యాచ్ జరిగే ఆదివారం (నవంబర్ 26) తిరువనంతపురంలో భారీగా వాన పడే అవకాశాలు లేవు. పడితే స్వల్పంగానే వాన ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్ రద్దయ్యే రేంజ్‍లో అయితే వాన ఉండకపోవచ్చు. ఆకాశం మేఘావృతమై ఉండనుంది. వర్షం పడే అవకాశాలు 25 శాతంగా ఉన్నాయి.
పిచ్ ఎలా..
టీమిండియా, ఆసీస్ మధ్య రెండో టీ20 జరిగే తిరువనంతపురం పిచ్ బౌలింగ్‍కు ఎక్కువ సహకరిస్తుంది. పేసర్లకు స్వింగ్ లభిస్తుంది. బౌన్స్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మధ్య ఓవర్లలో బ్యాట్ మీదికి బంతి అంత మెరుగ్గా రాకపోవచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసేందుకు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి.
లైవ్ వివరాలు
India vs Australia 2nd T20 Live Details: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఆదివారం (నవంబర్ 26) సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. స్పోర్ట్స్18 టీవీ ఛానెల్‍లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ప్రసారం అవుతుంది. జియో సినిమా ఓటీటీ యాప్, వెబ్‍సైట్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
తుది జట్లు
తుదిజట్టులో టీమిండియా మార్పులు చేసే అవకాశాలు తక్కువే. తొలి టీ20 ఆడిన జట్టునే రెండో మ్యాచ్‍కు కొనసాగించొచ్చు.
భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోస్ ఇంగ్లిస్, మార్క్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, మాథ్యు వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎలిస్, జేసన్ బెహరండార్ఫ్, తన్వీర్ సంఘా