IND vs AUS 2nd ODI Preview: సిరీస్‍పై కన్నేసిన టీమిండియా.. పిచ్, వాతావరణం, తుది జట్లు ఎలా ఉండొచ్చంటే..
IND vs AUS 2nd ODI Preview: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (సెప్టెంబర్ 24) రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్.. సిరీస్ కైవసంపై కన్నేసింది.
India vs Australia 2nd ODI Preview: టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డేకు అంతా రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్‍లో ఈ రెండో మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్డేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 24) జరగనుంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ ఈ సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే కూడా గెలిచి సిరీస్‍ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే ఖాయం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. నలుగురు ప్రధాన ఆటగాళ్లు మూడో వన్డేకు తిరిగి వచ్చేయనుండంతో.. ప్రయోగాలు చేసేందుకు ఈ రెండో వన్డే భారత్‍కు కీలక అవకాశంగా ఉంది. ఈ సిరీస్ తర్వాత భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ తరుణంలో ఆసీస్‍తో ఈ సిరీస్‍ను కాంబినేషన్లను సెట్ చేసుకునేందుకు భారత్ ఉపయోగించుకుంటోంది. ఇక ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో వన్డే వివరాలు ఇక్కడ చూడండి.
మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఇండోర్‌లో ఆదివారం (సెప్టెంబర్ 24) మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది. 1 గంటకు టాస్ పడుతుంది. స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్‍లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‍ను ఉచితంగా వీక్షించుచొచ్చు.
పిచ్ ఎలా?
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‍కు బాగా అనుకూలిస్తుంది. పిచ్ ఫ్లాట్‍గా ఉంటుంది. టీమిండియా చివరగా జనవరిలో న్యూజిలాండ్‍తో ఈ స్టేడియంలో ఆడినప్పుడు రోహిత్ శర్మ, గిల్ శతకాల మోతమోగించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అప్పుడు 385 పరుగులు చేసింది. ఇప్పుడు కూడా హోల్కర్ మైదానం పిచ్ బ్యాటింగ్‍కు అనుకూలంగానే ఉండనుంది.
వాతావరణం ఇలా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరిగే ఆదివారం (సెప్టెంబర్ 24) ఇండోర్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, స్వల్పంగానే కురిసే ఛాన్స్ ఉంది. వాన వల్ల ఆటకు విరామాలు కలగొచ్చు. అయితే, మ్యాచ్ రద్దయ్యేంత తీవ్రంగా అయితే వాన పడే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు. ఆకాశం మేఘావృతమై ఉండనుందని వాతావరణ రిపోర్టులు చెబుతున్నాయి.
తుది జట్లు..
రెండో వన్డేకు భారత తుది జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచకప్‍నకు ముందు సుందర్‌ను టీమిండియా మేనేజ్‍మెంట్ పరీక్షించాలనుకుంటోంది.
భారత తుది జట్టు (అంచనా): రుతురాజ్ గైక్వాడ్, శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్/ జస్‍ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా తుదిజట్టు (అంచనా): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, జోస్ ఇన్‍గ్లిస్/ఆరోన్ హార్డీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‍వుడ్