IGNITIO STAR WARS SEASON 2: ఇగ్నిషియో స్టార్ వార్స్.. ఛాంపియన్ గా ది బ్యాట్ కేవ్.. అదరగొట్టిన మోహన్-ignitio star wars season 2 champion the bat cave won final against classic cult stars mohan viyajreddy shines with bat ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ignitio Star Wars Season 2: ఇగ్నిషియో స్టార్ వార్స్.. ఛాంపియన్ గా ది బ్యాట్ కేవ్.. అదరగొట్టిన మోహన్

IGNITIO STAR WARS SEASON 2: ఇగ్నిషియో స్టార్ వార్స్.. ఛాంపియన్ గా ది బ్యాట్ కేవ్.. అదరగొట్టిన మోహన్

IGNITIO STAR WARS SEASON 2: ఇగ్నిషియో స్టార్ వార్స్ సీజన్ 2 లో ది బ్యాట్ కేవ్ టీమ్ అదరగొట్టింది. శుక్రవారం (మార్చి 28) జరిగిన ఫైనల్లో క్లాసిక్ కల్ట్ స్టార్స్ ను చిత్తుచేసిన ఆ టీమ్ విజేతగా నిలిచింది. ఎస్ఎస్‌కే అకాడమీ ఈ టోర్నీ నిర్వహించింది.

ఛాంపియన్ ది బ్యాట్ కేవ్ టీమ్

ఎస్ఎస్‌కే అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 క్రికెట్ టోర్నీలో ది బ్యాట్ కేవ్ విజేతగా నిలిచింది. ఈ సీజన్ లో సంచలన ప్రదర్శనతో సాగిన ది బ్యాట్ కేవ్.. తుదిపోరులోనూ అదరగొట్టింది. శుక్రవారం (మార్చి 28) హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ్ లో ఉన్న అర్బన్ ఫార్మ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఫైనల్ జరిగింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన క్లాసిక్ కల్ట్ స్టార్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ది బ్యాట్ కేవ్ 5 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. 5 వికెట్ల తేడాతో క్లాసిక్ కల్ట్ స్టార్ ను చిత్తుచేసి ట్రోఫీ సొంతం చేసుకుంది.

ప్రణీత్ ఫిఫ్టీ

ఎస్ఎస్‌కే అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 ఫైనల్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన క్లాసిక్ కల్ట్ స్టార్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు నాగార్జున (19), రాంకి (30) తొలి వికెట్ కు 50 భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ శ్రీకాంత్ ఒకే ఓవర్లో వీళ్లిద్దరినీ పెవిలియన్ చేర్చి క్లాసిక్ కల్ట్ స్టార్స్ ను దెబ్బ కొట్టాడు.

మస్తాన్ (5) కూడా త్వరగానే ఔటవడంతో క్లాసిక్ కల్ట్ స్టార్స్ 57/3తో కష్టాల్లో పడింది. ఆ దశలో ప్రణీత్ పోరాడాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దుర్గ ప్రసాద్ (29) తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 39 బంతుల్లో ప్రణీత్ 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 6 ఫోర్లు కొట్టాడు. ది బ్యాట్ కేవ్ బౌలర్లలో శ్రీకాంత్, రాధా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మోహన్ అదుర్స్

ఛేజింగ్ లో మోహన్ అదరగొట్టాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. ఓపెనర్ మోహన్ 41 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. 5 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. విజయ్ రెడ్డి (20 బంతుల్లో 43) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు.

విజయ్ రెడ్డి, మోహన్ వెంటవెంటనే ఔటైనా.. కెప్టెన్ వెంకీ (11 బంతుల్లో 19 నాటౌట్), రాధా (7 బంతుల్లో 15 నాటౌట్) ది బ్యాట్ కేవ్ ను గెలిపించారు. ఫైనల్లో మోహన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బెస్ట్ బ్యాటర్ గా ప్రణీత్, బెస్ట్ బౌలర్ గా రాధా అవార్డులు అందుకున్నారు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ ప్రణీత్ నిలిచాడు.

అత్యుత్తమ సేవలు

ఈ టోర్నీకి ది బ్యాట్ కేవ్, వావ్ కాజ్.కామ్, హైరింగ్ ఐ, టాలెంట్ కన్సల్టెంట్ స్పాన్సర్స్ గా వ్యవహరించాయి. ఇగ్నిషియో చైల్డ్ డెలవప్మెంట్ సెంటర్ ఏమో టైటిల్ స్పాన్సర్ గా నిలిచింది. ఇగ్నిషియో చైల్డ్ డెలవప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ విజేతలకు ట్రోఫీని అందజేశారు.

చిన్నతనంలో సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, అభివృద్ధి ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇగ్నిషియో అత్యుత్తమ సేవలను అందిస్తున్నదని తెలిపారు. అందరూ ఆటను ఆస్వాదిస్తూ గేమ్ ను కొనసాగించాలని కృష్ణ భరత్ ప్రోత్సహించారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం