ICC T20 Rankings: తిలక్ వర్మకు కెరీర్ బెస్ట్ ర్యాంక్.. టాప్ 5లోకి దూసుకొచ్చిన వరుణ్ చక్రవర్తి
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టీమిండియా బ్యాటింగ్ సెన్సేషన్ తిలక్ వర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. అటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ 5లోకి దూసుకురావడం విశేషం.
ICC T20 Rankings: ఐసీసీ బుధవారం (జనవరి 29) టీ20 ర్యాంకులను అనౌన్స్ చేసింది. ఇందులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకు సాధించడం విశేషం. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న 22 ఏళ్ల తిలక్.. ఇంగ్లండ్ కు చెందిన ఫిల్ సాల్ట్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వెళ్లాడు. అటు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా బౌలర్ల ర్యాంకుల్లో టాప్ 5లోకి దూసుకొచ్చాడు.

తిలక్ వర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్
ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉండేవాడు. అయితే రెండో టీ20లో 55 బంతుల్లో 72 రన్స్ చేసి టీమ్ ను గెలిపించిన అతడు.. తాజా ర్యాంకుల్లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. గత కొన్ని నెలలుగా టీ20 క్రికెట్ లో తిలక్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ను కూడా త్వరలోనే అతడు వెనక్కి నెట్టే అవకాశం కూడా ఉంది.
హెడ్ ప్రస్తుతం 855 పాయింట్లతో ఉండగా.. తిలక్ వర్మ 832 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తో మరో రెండు టీ20లు మిగిలి ఉండటంతో ఈ సిరీస్ లోనే అతడు టాప్ లోకి దూసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మూడో స్థానానికి ప్రమోట్ చేసిన తర్వాత తిలక్ చెలరేగిపోతున్నాడు.
టీ20 ర్యాంకుల్లో ఇండియా బ్యాటర్లు
టీ20 వరల్డ్ ఛాంపియన్ అయిన టీమిండియా నుంచి టాప్ 10లో పలువురు ఇతర బ్యాటర్లు కూడా ఉన్నారు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉన్నాడు.
ఇక యశస్వి జైస్వాల్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్ తాజా ర్యాంకుల్లో 17 నుంచి 29వ ర్యాంకుకు పడిపోయాడు.
టాప్ 5లోకి వరుణ్ చక్రవర్తి
అటు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజా ర్యాంకుల్లో టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఇంగ్లండ్ తో తొలి మూడు టీ20ల్లో రాణించడంతోపాటు మూడో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతడు ఏకంగా 25 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 679 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు.
మూడు మ్యాచ్ లలో వరుణ్ 10 వికెట్లు తీయడం విశేషం. ఇక తాజా ర్యాంకుల్లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తొలి స్థానానికి వెళ్లాడు. వెస్టిండీస్ కు చెందిన అకీల్ హొస్సేన్ రెండో స్థానంలో, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా మూడో స్థానంలో ఉన్నారు.
సంబంధిత కథనం