Hanuma Vihari: ఇంకెప్పుడూ ఆంధ్ర జట్టుకు ఆడను: షాకింగ్ విషయాలు వెల్లడించిన హనుమ విహారి
Hanuma Vihari Controversy: దేశవాళీ క్రికెట్‍లో తాను ఇంకెప్పుడూ ఆంధ్ర జట్టు తరఫున ఆడబోనని భారత క్రికెటర్ హనుమ విహారి తెలిపాడు. తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
Hanuma Vihari - Andhra Cricket: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టును హనుమ విహారీ విజయవంతంగా ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో ఆంధ్ర టీమ్ చివరి ఏడేళ్లలో నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. ప్రస్తుత సీజన్ క్వార్టర్ ఫైనల్‍లో కేవలం నాలుగు పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర ఓడింది. అయితే, ఈ ఏడాది సీజన్ మధ్యలోనే హనుమ విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA). అయితే, తనను కెప్టెన్సీ ఎందుకు తప్పించారో షాకింగ్ విషయాలను విహారి తాజాగా వెల్లడించారు. ఇది ఆంధ్ర క్రికెట్‍లో దుమారం రేపుతోంది. ఆ వివరాలివే..
రాజకీయ నేత కొడుకు వల్లే..
ఆంధ్ర జట్టు కెప్టెన్‍గా తనను తప్పించడంపై హనుమ విహారి.. నేడు (ఫిబ్రవరి 26) ట్వీట్ చేశాడు. తనను సారథ్యం నుంచి తొలగించేందుకు జట్టులో ప్లేయర్‌గా ఉన్న రాజకీయ నాయకుడి కుమారుడు కారణమని వెల్లడించాడు.
రాజకీయ నాయకుడి కుమారుడైన ఓ ఆటగాడిపై అరిచినందుకే తనను కెప్టెన్సీ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) తొలగించిందని, ఈ విషయంలో తన తప్పు లేదని విహారి వివరించాడు. “బెంగాల్‍తో మ్యాచ్‍కు నేను కెప్టెన్‍గా ఉన్నా. ఆ మ్యాచ్‍లో 17వ ప్లేయర్‌పై నేను అరిచా. దీంతో అతడు తండ్రికి (ఓ రాజకీయ నాయకుడు) కంప్లైట్ చేశాడు. నాపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్‍కు అతడి తండ్రి అడిగాడు. గతేడాది ఫైనలిస్ట్ బెంగాల్‍పై 410 పరుగులు ఛేజ్ చేసి మేం గెలిచినా.. నన్ను కెప్టెన్సీ నుంచి రాజీనామా చేయమన్నారు. నా తప్పేం లేదు. నేను ఆ ప్లేయర్‌ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. శరీరాన్ని పణంగా పెట్టి గతేడాది లెఫ్ట్ హ్యాండ్ కూడా ఆడిన.. ఏడేళ్లలో 5సార్లు జట్టును నాకౌట్ దశకు తీసుకెళ్లిన.. టీమిండియాకు 16 టెస్టులు ఆడిన వ్యక్తిని (నన్ను) కాదని, ఆ ప్లేయరే అసోసియేషన్‍కు ముఖ్యమయ్యాడు” అని విహారీ పేర్కొన్నాడు.
అవమానకరంగా..
తన తప్పులేకపోయినా కెప్టెన్సీ నుంచి తొలగించడం అవమానకరంగా అనిపించిందని, అయితే ఆట పట్ల తనకు గౌరవం కారణంగానే ఈ సీజన్‍లో ఆటగాడిగానే కొనసాగానని విహారి వెల్లడించారు. “నేను అవమానంగా భావించా. అయితే, నా ఆటను, జట్టును గౌరవించిన కారణంగానే ఈ సీజన్ ఆడడం కొనసాగించా. తాము ఏం చెబితే ప్లేయర్లు అదే చేయాలని అసోసియేషన్ అనుకుంటోంది. వాళ్ల వల్లే ప్లేయర్స్ ఉన్నారనుకుంటోంది. నాకు ఎంత అవమానం అనిపించినా.. నేటి వరకు వెల్లడించలేదు” అని విహారీ ఆ పోస్టులో వెల్లడించాడు.
తన ఆత్మగౌరవం దెబ్బ తినిందని, ఇక ఎప్పటికీ ఆంధ్ర జట్టుకు ఆడబోనని తేల్చేశాడు విహారి. తన జట్టు ప్రతీ సీజన్‍కు ఎదిగిన విధానాన్ని తాను చాలా ఇష్టపడ్డానని, కానీ ఎదగడం అసోసియేషన్‍కు అవసరం లేదని విహారి ఆవేదన వ్యక్తం చేశాడు.
టీమిండియా తరఫున కూడా హనుమ విహారి కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్టులో వీరోచితంగా పోరాడి.. భారత్‍ను ఓటమి నుంచి తప్పించాడు. భారత్ తరపున 16 టెస్టుల్లో 839 రన్స్ చేశాడు. దాంట్లో ఓ సెంచరీ కూడా ఉంది. ఆంధ్ర జట్టు తరఫున రంజీల్లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు విహారి. ఆ టీమ్ అత్యుత్తమంగా ఎదగడంలో కెప్టెన్‍గా కొన్నేళ్లుగా కీలకపాత్ర పోషించాడు. అయితే, ఇప్పుడు తాజా వివాదంతో ఇక ఆంధ్రకు ఎప్పటికీ ఆడబోనని తేల్చేశాడు.