Jasprit Bumrah: ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధ మయ్యా: జస్‍ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah: ఐర్లాండ్‍తో తొలి టీ20కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడాడు భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్‍తో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా కెప్టెన్సీ కూడా చేయనున్నాడు బుమ్రా.
Jasprit Bumrah: నిరీక్షణ ముగిసే సమయం సమీపించింది. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 11 నెలల తర్వాత మళ్లీ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐర్లాండ్‍తో రేపటి (ఆగస్టు 18) నుంచి జరిగే టీ20 సిరీస్‍లో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో జరిగే మూడు టీ20లకు అతడు కెప్టెన్సీ కూడా చేయనున్నాడు. ఇండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 డబ్లిన్ వేదికగా రేపు (ఆగస్టు 18) జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు మీడియా సమావేశంలో జస్‍ప్రీత్ బుమ్రా మాట్లాడాడు.
ట్రెండింగ్ వార్తలు
తాను ఇప్పుడు సాధారణంగా బౌలింగ్ చేయగలుగుతున్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని బుమ్రా చెప్పాడు. బౌలింగ్‍లో తాను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం, పూర్తి స్థాయిలో నెట్ సెషన్లలో ప్రాక్టీస్ చేసినట్టు స్పష్టం చేశాడు. పూర్తిగా కోలుకున్నట్టు చెప్పాడు. నడుము గాయం.. ఆ తర్వాత సర్జరీ కారణంగా గతేడాది సెప్టెంబర్ తర్వాతి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు బుమ్రా. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండటంతో అప్పటికల్లా అతడు జట్టులోకి మళ్లీ వస్తాడా లేదా అనే టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే, ఐర్లాండ్‍తో సిరీస్‍కు సిద్ధమవటంతో ఊరట లభించింది. అయితే, తాను ముందు నుంచి వన్డే ప్రపంచకప్‍ను దృష్టిలో ఉంచుకొనే సిద్ధమయ్యాయని బుమ్రా స్పష్టం చేశాడు.
“నేను కోలుకుంటున్నప్పుడు టీ20 క్రికెట్ కోసం సిద్ధమవలేదు. పూర్తిగా వన్డే ప్రపంచకప్‍ను దృష్టిలో పెట్టుకున్నా. ప్రపంచకప్ మ్యాచ్‍ల్లో 10 ఓవర్లు వేసేందుకే ప్రిపేర్ అయ్యా” అని బుమ్రా చెప్పాడు. గాయం నుంచి కోలుకున్నాక నెట్స్‌లో ప్రతీ రోజూ 10, 12 ఒక్కోసారి 15 ఓవర్లు వేసేవాడినని బుమ్రా చెప్పాడు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.
గాయం అయినప్పుడు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడితే కాస్త చిరాకుగా ఉంటుందని బుమ్రా అన్నాడు. అయితే, రికవరీ గురించి పెద్దగా డౌట్లు పెట్టుకోకుండా.. ఎలా మరింత మెరుగ్గా.. త్వరగా కోలుకోవాలనే దానిపైనే తాను ఎక్కువగా దృష్టి పెట్టినట్టు చెప్పాడు.
ఈనెలాఖర్లో ప్రారంభమయ్యే ఆసియా కప్ టోర్నీకి కూడా జస్‍ప్రీత్ బుమ్రా ఎంపికవడం దాదాపు ఖాయమైంది.
మూడు టీ20ల సిరీస్‍లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 రేపు (ఆగస్టు 18) జరగనుంది. యువ భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. రేపు సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.