Yuzvendra Chahal: ‘బాధ పడ్డా.. కానీ నేను కోరుకునేది అదే’: భారత స్పిన్నర్ చాహల్
Yuzvendra Chahal: ప్రపంచప్ కోసం భారత జట్టులో తనకు చోటు దక్కకపోవటంపై స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్పందించాడు. తనకు కాస్త బాధ కలిగిందని అన్నాడు. ఆ వివరాలివే..
Yuzvendra Chahal: స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో చాలా మ్యాచ్‍ల్లో టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 2016లో అరంగేట్రం చేసిన దగ్గరి నుంచి అదరగొడుతున్నాడు. అయితే, మూడేళ్లుగా మెగాటోర్నీల సమయంలో చాహల్‍కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. 2021 టీ20 ప్రపంచకప్, 2022 టీ20 వరల్డ్ కప్‍లో చాహల్‍కు ప్లేస్ లభించలేదు. తాజాగా ఈ ఏడాది 2023 వన్డే ప్రపంచకప్ కోసం కూడా భారత జట్టులో చాహల్‍కు చోటు దక్కలేదు. ఈ విషయంపై కొందరు మాజీలు.. సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చాహల్‍ను టీమిండియాలోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో యజువేంద్ర చాహల్ స్పందించాడు.
తనకు వన్డే ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కకపోవటంపై తాజాగా విజ్డెన్‍తో ఇంటర్వ్యూలో మాట్లాడాడు చాహల్. టీమిండియా మేనేజ్‍మెంట్ నిర్ణయాన్ని తాను అంగీకరిస్తున్నానని చెప్పాడు.
“ప్రపంచకప్ కాబట్టి.. 15 మందిని మాత్రమే ఎంపిక చేయగలరనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. 17, 18 మందిని తీసుకోలేరు. అయితే, నేను కాస్త బాధపడ్డాను. కానీ, ఏం జరిగినా ముందుకు సాగుతూనే ఉండాలన్నది నా నైజం. ఇప్పుడు కూడా అంతే. నాకు అలవాటైంది. వరుసగా మూడో ప్రపంచకప్ కదా” అని చాహల్ అన్నాడు. తనకు వరుసగా మూడు ప్రపంచకప్‍ల్లో చోటు దక్కకపోవడాన్ని చాహల్ గుర్తు చేశాడు.
జట్టులో చోటు దక్కినా.. దక్కపోయినా టీమిండియా గెలవాలన్నదే తన కోరిక, లక్ష్యమని చాహల్ అన్నాడు. బాగా ఆడితే చోటు దక్కుతుందని తనకు తెలుసని, అందుకే ఇంకా ఆడతానని చాహల్ అన్నాడు. “భారత జట్టులోని ఇతర స్పిన్నర్లతో పోటీ గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే ఒకవేళ నేను మెరుగైన ప్రదర్శన చేస్తే.. జట్టులో ప్లేస్ దక్కుతుంది. అందుకే నేను ఆడతా. కచ్చితంగా భవిష్యత్‍లో ఎవరో ఒకరు మీ స్థానాన్ని భర్తీ చేస్తారని తెలుసు. ఎప్పుడో ఒకసారి ఆ రోజు వస్తుంది” అని చాహల్ చెప్పాడు.
“నేను జట్టులో ఉన్నా.. లేకపోయినా.. వాళ్లు (భారత ఆటగాళ్లు) నాకు సోదరుల్లాంటి వారు. నేను ఎప్పుడైనా టీమిండియాకు సపోర్ట్ చేస్తా. మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు మరింత కష్టపడాలని నాకు తెలుసు. నాకు ఈ చాలెంజ్ నచ్చుతుంది” అని చాహల్ చెప్పాడు.
తొలుత ప్రపంచకప్ కోసం స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‍ను టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, అక్షర్ పటేల్ గాయపడినా.. సెలెక్టర్లు రవిచంద్రన్ అశ్విన్‍ను జట్టులోకి తీసుకున్నారు. చాహల్‍ను పరిగణనలోకి తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్ భారత్‍లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది.