IPL 2025: హైదరాబాద్ లో 9 .. వైజాగ్ లో 2 .. తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఐపీఎల్ కిక్.. కోహ్లి, ధోని దర్శనం అప్పుడే!
IPL 2025: ఐపీఎల్ 2025 తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు అసలైన టీ20 కిక్ ను అందించనుంది. రాబోయే సీజన్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో 9, వైజాగ్ లో 2 మ్యాచ్ లు జరగబోతున్నాయి.

ఐపీఎల్ 2025 షెడ్యూల్ ను ఆదివారం (ఫిబ్రవరి 16) బీసీసీఐ ప్రకటించింది. ఈ షెడ్యూల్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కు జోష్ వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్, వైజాగ్ లో కలిపి 11 ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు, ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో 2 మ్యాచ్ లు జరుగుతాయి. మధ్యాహ్నం మ్యాచ్ 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్ 7.30 గంటలకు ఆరంభమవుతాయి.
మార్చి 23న షురూ
ఉప్పల్ స్టేడియంలో లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ లు ఆడుతుంది. మార్చి 23న రాజస్థాన్ తో మ్యాచ్ మాత్రమే మధ్యాహ్నం ఆరంభమవుతుంది. మిగతావన్నీ రాత్రి జరుగుతాయి. మార్చి 27న లక్నోతో, ఏప్రిల్ 6న గుజరాత్ తో, ఏప్రిల్ 12న పంజాబ్ తో, ఏప్రిల్ 23న ముంబయితో, మే5న దిల్లీతో, మే 10న కోల్ కతాతో సన్ రైజర్స్ తలపడుతుంది. అనంతరం రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లూ (మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్) ఇక్కడ జరుగుతాయి.
వైజాగ్ లో రెండు
విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని మరోసారి సెకండ్ హోం గ్రౌండ్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఐపీఎల్ 2025 లో ఇక్కడ ఆ జట్టు రెండు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 25న లక్నో సూపర్ జెయింట్స్ తో, మార్చి 30న మధ్యాహ్నం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడుతుంది. గత సీజన్ లోనూ వైజాగ్ లో ఢిల్లీ రెండు మ్యాచ్ లాడింది.
అలా అయితేనే కోహ్లి, ధోని
ఉప్పల్, వైజాగ్ లీగ్ దశలో 9 మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్నప్పటికీ వీటిల్లో స్టార్ ప్లేయర్లు కోహ్లి, ధోనీని చూసే అవకాశం లేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశే. ఎందుకంటే కోహ్లి జట్టు ఆర్సీబీ కానీ ధోని జట్టు సీఎస్కే కానీ ఉప్పల్ లేదా వైజాగ్ లో మ్యాచ్ ఆడటం లేదు. అయితే ఆ జట్లు క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ లో ఆడితే మాత్రం అప్పుడు కోహ్లి, ధోనీలను హైదరాబాద్ లో చూడొచ్చు. ఈ రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు ఉప్పల్ స్టేడియం వేదిక.
సంబంధిత కథనం