Tanmay Agarwal: 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి-hyderabad batter tanmay agarwal triple century in ranji trophy cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Tanmay Agarwal: 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

Tanmay Agarwal: 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

Hari Prasad S HT Telugu

Tanmay Agarwal: హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు.

హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్

Tanmay Agarwal: రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చరిత్ర తిరగరాశాడు. అతడు కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు.

1772లో మొదలైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 150 బంతుల్లోపే ఓ బ్యాటర్ ట్రిపుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అతని దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు విలవిల్లాడారు.

తన్మయ్.. రికార్డుల హోరు

అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ మ్యాచ్ లో హైదరాబాద్ చెలరేగిపోయింది. మొదట ఆ టీమ్ ను కేవలం 172 పరుగులకే ఆలౌట్ చేసింది. తర్వాత తన్మయ్ ఊచకోతతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 48 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 529 రన్స్ చేసింది. తన్మయ్ అగర్వాల్ 160 బంతుల్లోనే 33 ఫోర్లు, 21 సిక్స్ లతో 323 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మరో ఓపెనర్ రాహుల్ సింగ్ గహ్లోత్ కూడా కేవలం 105 బంతుల్లో 185 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 26 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు కేవలం 40.2 ఓవర్లలోనే 449 రన్స్ జోడించడం విశేషం. ఈ ఇద్దరి ధాటికి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు బిక్కుబిక్కుమంటూ బౌలింగ్ చేశారు. ఆ టీమ్ బౌలర్ దివ్యాంషు యాదవ్ కేవలం 9 ఓవర్లలోనే 117 పరుగులు సమర్పించుకున్నాడు.

252 ఏళ్లలో ఇదే తొలిసారి

విజ్డన్ ప్రకారం 1772లో తొలిసారి ఓ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఓ బ్యాటర్ ఈ ఫార్మాట్ లో 150 బంతుల్లోపే ట్రిపుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంటే 252 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ గా తన్మయ్ నిలిచాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో తన్మయ్ 21 సిక్స్ లు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గానూ ఇషాన్ కిషన్ రికార్డు బ్రేక్ చేశాడు.

ఇక రంజీ ట్రోఫీలో ఒకే రోజులో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ తన్మయ్ అగర్వాలే. నిమిషాల పరంగా చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండో అత్యంత వేగంగా నమోదైన ట్రిపుల్ సెంచరీగా ఇది నిలిచింది. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గానూ తన్మయ్ నిలిచాడు.

తన్మయ్ కేవలం 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. గతంలో రవిశాస్త్రి 123 బంతుల్లో కొట్టిన డబుల్ సెంచరీ రికార్డును తన్మయ్ బ్రేక్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఓవరాల్ గా ఇది రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ. ఇలా తన్మయ్ అగర్వాల్ ఒకే మెరుపు ఇన్నింగ్స్ తో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.