Hong Kong Sixes Ind vs Pak: హాంకాంగ్ సిక్సెస్.. ఇండియాను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్.. ఐదు ఓవర్లలోనే..
Hong Kong Sixes Ind vs Pak: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ తొలి రోజే పాకిస్థాన్ చేతుల్లో ఇండియన్ టీమ్ చిత్తుగా ఓడింది. ఇండియా విధించిన 120 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 5 ఓవర్లలోనే కొట్టేయడం గమనార్హం.
Hong Kong Sixes Ind vs Pak: హాంకాంగ్ సిక్సెస్.. క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల వర్షంలో ముంచెత్తే టోర్నీ ఇది. అసలు టీ20 అంటే కూడా తెలియని 1990ల్లోనే ఈ టోర్నీ పరుగుల వర్షాన్ని కురిపిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించింది. అలాంటి టోర్నీ చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. శుక్రవారం (నవంబర్ 1) ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి రోజే పాకిస్థాన్ చేతుల్లో ఇండియా చిత్తుగా ఓడిపోయింది.
ఐదు ఓవర్లలోనే హాంఫట్
హాంకాంగ్ సిక్సెస్ ఫార్మాట్ చాలా వింతగా ఉంటుందని తెలుసు కదా. ఒక్కో టీమ్ లో కేవలం ఆరుగురు ప్లేయర్సే ఉంటారు. ఒక్కో ఇన్నింగ్స్ ఆరు ఓవర్లలోనే ముగుస్తుంది. గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. దీంతో పరుగుల వర్షం కురుస్తుంది. అందుకే ఇండియా విధించిన 120 పరుగుల లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ కేవలం 5 ఓవర్లలో చేజ్ చేసిందంటే ఏ స్థాయిలో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇండియా బౌలర్లు స్టువర్ట్ బిన్నీ, షాబాజ్, కేదార్ జాదవ్ లాంటి వాళ్లను పాక్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ఆసిఫ్ అలీ కేవలం 14 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే పాకిస్థాన్ 120 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా చేజ్ చేసింది. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ నిబంధనల ప్రకారం.. ఓ బ్యాటర్ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే రిటైరవ్వాలి. అలా ఆసిఫ్ అలీ మాత్రమే క్రీజు వదలగా.. మిగిలిన పరుగులను ముహ్మద్ అఖ్లక్ (12 బంతుల్లో 40 పరుగులు) పూర్తి చేశాడు.
ఇండియా 6 ఓవర్లలో 119/2
అంతకుముందు ఇండియా బ్యాటింగ్ చేసింది. ఇండియన్ టీమ్ లో రాబిన్ ఊతప్ప, రాహుల్ చిప్లి, మనోజ్ తివారీ, కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, షాబాజ్ ఉన్నారు. ఓపెనర్లుగా ఊతప్ప, చిప్లి వచ్చారు. తొలి ఓవర్లోనే ఊతప్ప ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. అతడు ఔటైన తర్వాత చిప్లి చెలరేగాడు. అతడు కేవలం 16 బంతుల్లోనే 53 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు.
దీంతో ఇండియన్ టీమ్ 6 ఓవర్లలోనే 2 వికెట్లకు 119 పరుగులు చేసింది. ఈ స్కోరుతో ఇండియా గెలుస్తుందని భావించినా.. దిమ్మదిరిగే షాక్ తగిలింది. సరైన బౌలర్లు లేకపోవడంతో ఓటమి తప్పలేదు. స్టువర్ట్ బిన్నీ, షాబాజ్, కేదార్ జాదవ్, తివారీలను అలవోకగా ఎదుర్కొన్న పాక్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కేవలం 5 ఓవర్లలోనే 120 పరుగులను ఉఫ్ మని ఊదేశారు.