Hong Kong Sixes: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది.. షెడ్యూల్ ఇదే-hong kong international cricket sixes to return to play from november 1st to 3rd ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hong Kong Sixes: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది.. షెడ్యూల్ ఇదే

Hong Kong Sixes: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది.. షెడ్యూల్ ఇదే

Hari Prasad S HT Telugu
Aug 06, 2024 07:48 AM IST

Hong Kong Sixes: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇది పండగలాంటి వార్త. 1990ల్లో కొత్తగా వచ్చి ఎంతగానో అలరించిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది. ఈ ఏడాది నవంబర్లో ఈ టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది.

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది.. షెడ్యూల్ ఇదే
క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది.. షెడ్యూల్ ఇదే

Hong Kong Sixes: క్రికెట్ లో ఓ ప్రత్యేకమైన ఫార్మాట్ ను తీసుకొచ్చి అభిమానులను ఎంతో అలరించిన టోర్నీ హాంకాంగ్ సిక్సెస్. ప్రతి ఏటా క్రికెట్ క్యాలెండర్ లో ఈ టోర్నీని ఎంతో ప్రత్యేకంగా చూసేవారు క్రికెట్ అభిమానులు. 1992 నుంచి 2017 మధ్య 25 ఏళ్ల పాటు వినోదాన్ని పంచిన ఈ టోర్నీ.. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కాబోతోంది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ సిక్సెస్ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుంది.

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ

తూర్పు ఆసియాలో క్రికెట్ కు కేరాఫ్ గా నిలిచే నగరం హాంకాంగ్. ఈ నగరంలో 1842లోనే తొలిసారి క్రికెట్ ఆడినట్లు రికార్డుల్లో ఉంది. అలాంటి చారిత్రక నగరంలో ఒక్కో జట్టులో కేవలం ఆరుగురు ప్లేయర్స్ అనే భిన్నమైన కాన్సెప్ట్ తో హాంకాంగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ సిక్సెస్ వచ్చింది. 1990ల్లో అన్ని దేశాల టాప్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనేవాళ్లు.

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా,షేన్ వార్న్ లాంటి లెజండరీ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ ఇది. ప్రపంచంలో కేవలం హాంకాంగ్ లో మాత్రమే కనిపించే ఈ ఫార్మాటే ఈ టోర్నీకి ప్రత్యేకం. అలాంటి టోర్నీ ఇప్పుడు మరోసారి క్రికెట్ అభిమానులను అలరించడానికి వస్తోంది. ఇది నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త అని చెప్పొచ్చు.

హెచ్‌కే6 టోర్నీ షెడ్యూల్

మనం టీ20 క్రికెట్, టీ10 క్రికెట్ కూడా చూస్తున్నాం. ఈ ఫార్మాట్లు మహా అయితే 20 ఏళ్లుగా మనకు బాగా తెలుసు. కానీ వీటి కంటే అత్యంత వేగంగా ముగిసిపోయే ఫార్మాట్ ఈ హాంకాంగ్ సిక్సెస్. ప్రపంచంలో క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ గా పేరుగాంచిన ఈ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా క్యాలెండర్లో చోటు కల్పించేదంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈసారి క్రికెట్ హాంకాంగ్, చైనా సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహించబోతున్నాయి. నవంబర్ 1 నుంచి 3 వరకు ఈ టోర్నీ జరగనుంది. టిన్ క్వాంగ్ రోడ్ క్రికెట్ గ్రౌండ్ ఈ సిక్సెస్ కు ఆతిథ్యమివ్వనుంది. 12 దేశాలు మూడు రోజుల పాటు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ హాంకాంగ్ సిక్సెస్ ను మళ్లీ ఓ గ్లోబల్ సిరీస్ గా మార్చాలన్నదే తమ లక్ష్యం అని క్రికెట్ హాంకాంగ్ ఛైర్‌పర్సన్ చెప్పారు.

1990ల్లో అసలు టీ20 ఫార్మాట్ అంటే తెలియని రోజుల్లోనే క్రికెట్ లో వేగం పెంచిన ఘనత ఈ హాంకాంగ్ సిక్సెస్ కు దక్కుతుంది. ఆ కాలంలో పెద్ద పెద్ద హిట్టర్లుగా పేరుగాంచిన జయసూర్య, అఫ్రిది, రాబిన్ సింగ్ లాంటి వాళ్లు ఈ టోర్నీ ద్వారానే వెలుగులోకి వచ్చారు. అంతేకాదు సచిన్, వార్న్, వసీం అక్రమ్, కుంబ్లే, ధోనీలాంటి వాళ్లు కూడా ఈ టోర్నీలో ఆడారు. మరి మూడు రోజుల పాటు సాగనున్న ఈ హాంకాంగ్ సిక్సెస్ ఈసారి క్రికెట్ అభిమానులకు ఎలాంటి అనుభవాన్ని పంచుతుందో చూడాలి.