Bangladesh Records: టెస్టుల్లో బంగ్లాదేశ్ 400+ స్కోరు ఛేజింగ్ రికార్స్ ఇలా.. ఒక్కసారి మాత్రమే!
IND vs BAN 1st Test: చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. బంగ్లాదేశ్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. కానీ ఆ జట్టు ఛేజింగ్ రికార్డులు చూస్తే…
Bangladesh chases Records: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తిగా జరుగుతోంది. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం బంగ్లాదేశ్‌కి 515 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. దాంతో బంగ్లాదేశ్ ఛేజింగ్ రికార్డుల గురించి నెటిజన్లు వెతుకుతున్నారు.
మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేయగా, బంగ్లా జట్టు 149 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 515 పరుగుల లక్ష్యాన్ని పర్యాటక జట్టుకి రోహిత్ సేన నిర్దేశించింది.
బంగ్లా ముందు కొండత లక్ష్యం
వాస్తవానికి 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. అయినప్పటికీ రిస్క్ తీసుకోకూడదని భావించిన భారత్ జట్టు.. ఈరోజు రెండు సెషన్లలో బ్యాటింగ్ చేసి 515 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఇటీవల పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే ఇదే బంగ్లాదేశ్ టీమ్ చిత్తుగా ఓడించిన విషయ తెలిసిందే.
టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ ముందు 400కు పైగా పరుగుల లక్ష్యం ఉండటం ఇది 21వ సారి. అయితే 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బంగ్లాదేశ్ టీమ్ టెస్టుల్లో గెలవలేదు. 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ టీమ్ ఇప్పటికే 19 సార్లు ఓడిపోగా, ఒక మ్యాచ్‌ను మాత్రం అతి కష్టంగా డ్రాగా ముగించింది.
భారత్ గెలుపు నల్లేరుపై నడకే..
చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల లక్ష్యం ఉండటంతో.. భారత్ జట్టు గెలుపు దాదాపు ఖాయమైంది. అయినప్పటికీ బంగ్లాను తేలిగ్గా తీసుకోకూడదని టీమిండియా భావిస్తోంది. టెస్టుల్లో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ అత్యధిక పరుగుల లక్ష్యఛేదన 217 పరుగులు మాత్రమే. 2009లో వెస్టిండీస్‌పై ఆ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించింది.
ఈరోజు యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 119 పరుగులు చేశాడు. అతనికి టెస్టు కెరీర్ లో ఇది ఐదో సెంచరీ. అలానే 16 నెలల తర్వాత టెస్టు క్రికెట్లోకి తిరిగి వచ్చిన పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పంత్‌కి టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ.
2022 డిసెంబర్ నుంచి పంత్ టెస్టు మ్యాచ్‌లకి దూరంగా ఉండిపోయాడు. కారు ప్రమాదం తర్వాత చాలా కాలం క్రికెట్‌కు ఈ యంగ్ వికెట్ కీపర్ దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది జూన్‌లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసి.. తాజాగా సెంచరీతో టెస్టుల్లోకి తన రీఎంట్రీని ఘనంగా చాటాడు.
ఇంకా రెండు రోజులు టైమ్
515 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ టీమ్ ప్రస్తుతం 86/2తో కొనసాగుతోంది. క్రీజులో కెప్టెన్ శాంటో (14 బ్యాటింగ్: 14 బంతుల్లో 1x4, 1x6), మినిమల్ హక్ (0) ఉన్నారు. ఓపెనర్లు జాకీర్ హసన్ 33 పరుగులు, ఇస్లాం 35 పరుగులు చేసి ఔటయ్యారు. ఇస్లామ్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. జాకీర్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. మ్యాచ్‌లో సెంచరీ చేసిన అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. బంగ్లా చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.