Henry Olonga: ఒకప్పటి స్టార్ జింబాబ్వే క్రికెటర్ ఇప్పుడు పెయింటింగ్‌లు వేస్తూ.. ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో..
Henry Olonga: ఒకప్పటి స్టార్ జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలొంగా గుర్తున్నాడా? సచిన్ టెండూల్కర్ చితకబాదిన ఈ బౌలర్ ఇప్పుడు పెయింటింగ్స్ వేసుకుంటూ బతుకుతున్నాడు. అడిలైడ్ ఓవల్లో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో అతడు కనిపించాడు.
Henry Olonga: హెన్రీ ఒలొంగా పేరు వినిపించగానే ఇండియన్ క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కరే గుర్తొస్తాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేశానని రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకున్న ఈ బౌలర్ ను తర్వాతి మ్యాచ్ లోనే మాస్టర్ చితకబాదాడు. అలా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయిన ఈ పేస్ బౌలర్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పొట్టపోసుకోవడం కోసం పెయింటింగ్స్ వేస్తుండటం గమనార్హం.
హెన్రీ ఒలొంగా.. పెయింటర్
1990ల చివర్లో జింబాబ్వే క్రికెట్ లో కొంతకాలం పాటు ఓ వెలుగు వెలికిన పేస్ బౌలర్ హెన్రీ ఒలొంగా. అంతేకాదు 2003 వరల్డ్ కప్ సందర్భంగా తన దేశంలో నియంత పాలన చేస్తున్న రాబర్ట్ ముగాబేకు వ్యతిరేకంగా నల్ల బ్యాండు ధరించిన ప్లేయర్ అతడు. ఆ తర్వాత పదేళ్ల పాటు ఇంగ్లండ్ లో గడిపిన అతడు.. 2015లో ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు.
అప్పటి నుంచి పెయింటింగ్ వేస్తూ జీవిస్తున్నాడు. ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా గ్రౌండ్ లో పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. అక్కడి లైవ్ పెయింటింగ్ వేస్తే అతనికి గంటకు కొంత మొత్తం లభిస్తుంది. దానితోనే అతడు గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఒలొంగాతో మాట్లాడగా.. 1998లో షార్జాలో సచిన్ తన బౌలింగ్ ను చితకబాదడం గురించి గుర్తు చేసుకున్నాడు.
1998లో ఏం జరిగిందంటే?
1998లో షార్జాలో ఇండియా, జింబాబ్వే మధ్య ఓ మ్యాచ్ జరిగింది. అందులో ఓ షార్ట్ బాల్ తో సచిన్ ను ఒలొంగా ఔట్ చేశాడు. ఆ మ్యాచ్ లో జింబాబ్వే కేవలం 205 పరుగులను డిఫెండ్ చేసుకుంది. ఒలొంగా 46 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అయితే అతనికి ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
రెండు రోజుల గ్యాప్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సచిన్ లెక్క సరిచేశాడు. ఆ మ్యాచ్ లో ఇండియా 197 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. సచిన్ 92 బంతుల్లోనే 124 రన్స్ చేశాడు. ముఖ్యంగా ఒలొంగాను టార్గెట్ చేయడం విశేషం. దీంతో అతడు 6 ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్నాడు.
"ఫైనల్లో అతడు చితకబాదేశాడు. నేను చాలా పరుగులు ఇచ్చాను. ఆ రోజు అతడు అద్భుతంగా ఆడాడు. అతడు చాలా మంచి ప్లేయర్. సచిన్.. అతన్ని ఎప్పుడూ గౌరవిస్తాను" అని హెన్రీ ఒలొంగా అన్నాడు.
బుమ్రా, సిరాజ్‌లకు వీరాభిమానిని: ఒలొంగా
"నేను సిరాజ్, బుమ్రాలకు అభిమానిని. బుమ్రా బెస్ట్ బౌలర్. ప్రత్యేకమైన యాక్షన్. హై రిలీజ్.. అద్భుతమైన మణికట్టు. షార్ట్ రనప్. అతడు వసీం అక్రమ్ ను గుర్తుకు తెస్తాడు. అతడు ఊపు మీదుంటే ఇండియా తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేసుకోగలదు.
నేను ఆడే రోజుల్లో ఇండియా అంటే స్పిన్నర్లే. కానీ ఇప్పుడు గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బ్యాటింగ్ లోనూ మంచి ప్లేయర్స్ ఉన్నారు" అని ఒలొంగా అన్నాడు. గత కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెట్ చాలా మారిపోయిందని చెప్పాడు.