ENG vs SA: క్లాసెన్, జాన్సెన్ ఊర మాస్ బాదుడు.. ఇంగ్లండ్‍కు భారీ టార్గెట్-heinrich klaasen hits blazing century against england in odi world cup 2023 ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Heinrich Klaasen Hits Blazing Century Against England In Odi World Cup 2023

ENG vs SA: క్లాసెన్, జాన్సెన్ ఊర మాస్ బాదుడు.. ఇంగ్లండ్‍కు భారీ టార్గెట్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 21, 2023 06:13 PM IST

ENG vs SA World Cup 2023: దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ సూపర్ హిట్టింగ్ చేశారు. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఉంది.

క్లాసెన్, జాన్సెన్
క్లాసెన్, జాన్సెన్ (AFP)

ENG vs SA World Cup 2023: బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ (67 బంతుల్లో 109 పరుగులు; 12 పోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శకతంతో చెలరేగడం సహా మార్కో జాన్సెన్ (42 బంతుల్లో 75 పరుగులు) సూపర్ హిట్టింగ్‍తో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‍కు కొండంత టార్గెట్‍ను సెట్ చేసింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ముంబైలోని వాంఖడే స్డేడియంలో నేడు (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్ల హిట్టింగ్‍తో వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. క్లాసెన్, జాన్సెన్‍తో పాటు రెజా హెన్‍డ్రిక్స్ (75 బంతుల్లో 85 పరుగులు), రాసీ వాండెర్ డుసెన్ (60 పరుగులు) కూడా దుమ్మురేపారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీకి మూడు, ఆదిల్ రషీద్‍,అట్కిన్‍సన్‍కు చెరో రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. మాస్ హిట్టింగ్‍తో ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపారు. ముఖ్యంగా క్లాసెన్, జాన్సెన్ వీరబాదుడుతో చివరి 10 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 400 పరుగుల భారీ టార్గెట్ ఛేదించాలి.

ట్రెండింగ్ వార్తలు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్ రెండో బంతికే షాక్ ఎదురైంది. క్వింటన్ డికాక్ (4)ను ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ ఔట్ చేశాడు. అయితే, బవుమా స్థానంలో జట్టులోకి వచ్చిన యువ బ్యాటర్ రెజా హెన్‍డ్రిక్స్ అదరగొట్టాడు. దూకుడుగా ఆడాడు. అతడికి రాసీ వాండర్ డుసెన్ తోడయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 48 బంతుల్లో హెన్‍డ్రిక్స్, 49 బంతుల్లో డుసెన్ అర్ధ శతకాలు చేశారు. రెండో వికెట్‍కు 121 పరుగులు జోడించారు. డుసెన్ ఔటైనా కాసేపు హెన్‍డ్రిక్స్ మెరుపులు మెరిపించాడు. అతడు ఔటయ్యాక కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ (42) కూడా రాణించాడు. డేవిడ్ మిల్లర్ (5) విఫలమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 350 పరుగులైనా చేయగలదా అనే డౌట్ ఏర్పడింది. అయితే, అప్పుడే హిట్టింగ్ సునామీ షురూ అయింది.

ఇంగ్లండ్ బౌలర్లపై హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ ఊహించని ఎదురుదాడి చేశారు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. ముఖ్యంగా క్లాసెన్ తన మార్క్ భారీ హిట్టింగ్‍తో విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో అర్ధ శతకం చేసిన క్లాసెన్.. మెరుపు వేగంతో 61 బంతుల్లోనే సెంచరీకి చేరాడు. ఇది చూస్తేనే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మార్కో జాన్సెన్ చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. జాన్సెన్ 35 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరి ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. క్లాసెన్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 భారీ స్కోరు చేసింది దక్షిణాఫ్రికా. చివరి 10 ఓవర్లలో143 పరుగులు రాబట్టింది. 

WhatsApp channel