Champions trophy: రాహుల్ ను కోరుకున్న కోచ్.. పంత్ ను ఆడించాలన్న సెలక్టర్.. గంభీర్ వర్సెస్ అగార్కర్
Champions trophy: ఛాంపియన్స్ ట్రోఫీ దిశగా భారత జట్టును సన్నద్ధం చేసే క్రమంలో హెడ్ కోచ్ గంభీర్ వర్సెస్ చీఫ్ సెలక్టర్ అగార్కర్ అనేలా పరిస్థితి మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ టోర్నీ దిశగా జట్టు ఎంపిక, ఆటగాళ్లను ఆడించే విషయంలో హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగినట్లు తెలిసింది. వికెట్ కీపర్ గా రాహుల్ ను ఆడించాలని గంభీర్, పంత్ ను కొనసాగించాలని అగార్కర్ పట్టుబట్టినట్లు సమాచారం.
శ్రేయస్ పై చర్చ
జట్టులో ఎక్కువగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండేలా గంభీర్ ప్లాన్ చేసుకున్నాడని తెలిసింది. అందుకే ఇంగ్లండ్ తో తొలి వన్డేలో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను ఆడించారు. కానీ అనుకోకుండా అవకాశం దక్కించుకున్న శ్రేయస్ రాణించడంతో అతణ్ని జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి నెలకొంది. శ్రేయస్ ను కొనసాగించడంపై సెలక్షన్ కమిటీ మీటింగ్ లో గంభీర్, అగార్కర్ తీవ్రంగా చర్చించారని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో తెలిపింది.
పంత్ వర్సెస్ రాహుల్
వికెట్ కీపర్ గా పంత్ ను కొనసాగించేందుకు అగార్కర్ మొగ్గు చూపాడు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించిన తర్వాత మీడియాతో పంత్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని అగార్కర్ చెప్పాడు. కానీ గంభీర్ మాత్రం కేఎల్ రాహుల్ నే వికెట్ కీపర్ గా ఆడించాలని పట్టుబట్టాడు. అందుకే ఇంగ్లండ్ తో సిరీస్ లో రాహుల్ ను ఆడించి, పంత్ ను పక్కనపెట్టారని తెలిసింది. రాహుల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని గంభీర్ ప్రకటించాడు.
గంభీర్ పై విమర్శలు
గంభీర్ ఒంటెద్దు పోకడలపై ఇటీవల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రేయస్ ను ఆడించాలని అనుకోకపోవడం, రాహుల్ ను అయిదులో కాకుండా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దించడం పై మాజీలు మండిపడ్డారు. కానీ శ్రేయస్ నిలకడగా రాణిస్తుండటంతో కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ తో సిరీస్ లో అతను 181 పరుగులతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, జడేజా తో మిడిలార్డర్ పటిష్ఠంగా మారింది.
సంబంధిత కథనం