సస్పెన్స్ వీడింది. ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్స్ కొత్త కెప్టెన్ వచ్చేశాడు. వన్డే, టీ20లకు కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ టీమ్ దారుణ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇంగ్లాండ్ నెక్ట్స్ కెప్టెన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగింది.టెస్టు కెప్టెన్ స్టోక్స్ కూడా వైట్ బాల్ కెప్టెన్సీ చేపడతాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ హ్యారీ బ్రూక్ కు సారథ్యం దక్కింది.
వైట్ బాల్ కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ నియామకాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం అనౌన్స్ చేసింది. పనిభారం కారణంగా ఈ కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ ఐపీఎల్ 2025 సీజన్ నుంచి లాస్ట్ మినట్లో తప్పుకోవడంతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు.
26 ఏళ్ల బ్రూక్ 2022 జనవరిలో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంగ్లాండ్ వైట్ బాల్ సెటప్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ యువ ఆటగాడు ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లలో గత ఏడాదిగా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.
ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఘోర పరాభవాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక్క విజయం లేకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో కెప్టెన్ పదవికి బట్లర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్ గా దక్షిణాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు.
బట్లర్ గైర్హాజరీలో గత సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ కు బ్రూక్ నాయకత్వం వహించాడు. 2018లో న్యూజిలాండ్ లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లోనూ ఇంగ్లాండ్ ను నడిపించాడు.
బ్రూక్ ఇంగ్లాండ్ తరఫున 26 వన్డేలు ఆడి 34.00 సగటుతో 816 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 110. 44 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 2022లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఈసీబీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
‘‘ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ గా ఎంపిక కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నా. నేను చిన్నప్పటి నుండి వార్ఫెడేల్లోని బర్లీలో క్రికెట్ ఆడా. ఇంగ్లాండ్ తరఫున ఆడాలని, బహుశా ఏదో ఒక రోజు జట్టుకు నాయకత్వం వహించాలని కలలు కన్నాను. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వడం నాకెంతో గర్వకారణం'’ అని బ్రూక్ అన్నాడు.
సంబంధిత కథనం