Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై వేటు తప్పదా.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్‌ కొత్త కెప్టెన్ ఈమె చేతికే!-harmanpreet kaur to lose her captaincy smriti mandhana may be the new captain after t20 world cup loss ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై వేటు తప్పదా.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్‌ కొత్త కెప్టెన్ ఈమె చేతికే!

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై వేటు తప్పదా.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్‌ కొత్త కెప్టెన్ ఈమె చేతికే!

Hari Prasad S HT Telugu

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెప్టెన్సీని కోల్పోనుందా? టీ20 వరల్డ్ కప్ 2024 తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడంతో బీసీసీఐ కొత్త కెప్టెన్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే స్మృతి చేతికి పగ్గాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

హర్మన్‌ప్రీత్‌పై వేటు తప్పదా.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్‌ కొత్త కెప్టెన్ ఈమె చేతికే! (Hindustan Times)

Harmanpreet Kaur: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ టీ20 వరల్డ్ కప్ 2024లో కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఇంటికి తిరిగి వచ్చేయడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. దీంతో మొదటి వేటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పైనే పడనున్నట్లు సమాచారం. కెప్టెన్సీ మార్పు గురించి బోర్డు సీరియస్ గా ఆలోచిస్తోందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు వెల్లడించింది.

హర్మన్‌ప్రీత్‌పై వేటు తప్పదా?

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి ఇప్పుడు హర్మన్ ప్రీత్ కెప్టెన్సీకి ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. గ్రూప్ స్టేజ్ లోనే మెగా టోర్నీ నుంచి ఇంటికెళ్లిపోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమితో ఇండియన్ టీమ్ సెమీస్ కూడా చేరలేకపోయింది. దీంతో కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ ఆలోచన చేస్తోందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్.. బీసీసీఐ అధికారులు, సెలెక్షన్ కమిటీని కలిసి దీనిపై చర్చించనున్నట్లు కూడా ఆ రిపోర్టు వెల్లడించింది.

"కొత్త కెప్టెన్ ను తీసుకొచ్చే అంశాన్ని బీసీసీఐ కచ్చితంగా పరిగణిస్తుందనడంలో సందేహం లేదు. ఇండియన్ టీమ్ కు కావాల్సిన ప్రతిదీ బోర్డు వాళ్లకు ఇచ్చింది. దీంతో భవిష్యత్తులో ఓ కొత్త కెప్టెన్ వాళ్లను లీడ్ చేయాలని భావిస్తున్నాం" అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది. అక్టోబర్ 24న న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న సిరీస్ కు ముందే హెడ్ కోచ్, బీసీసీఐ సమావేశం జరగనుంది.

కొత్త కెప్టెన్ స్మృతి మందానా?

ఒకవేళ హర్మన్ ప్రీత్ పై వేటు వేస్తే.. కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. అందరి కళ్లూ ఓపెనర్ స్మృతి మంధానాపైనే ఉన్నాయి. టీమ్ లో చాలా సీనియర్ ప్లేయర్, డబ్ల్యూపీఎల్లో కెప్టెన్ గా చేస్తున్న స్మృతికి మరోసారి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆమె కెప్టెన్సీలో ఈ ఏడాది ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ టైటిల్ కూడా గెలిచింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ గా ఉంది. 2016 నుంచి హర్మన్ ప్రీత్ కెప్టెన్ గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ మెగా టోర్నీకి కొత్త కెప్టెన్ సారథ్యంలో టీమ్ సిద్ధం కావాలని బోర్డు భావిస్తోంది. అయితే కెప్టెన్ గా కొనసాగకపోయినా.. టీమ్ లో ఓ కీలకమైన ప్లేయర్ గా మాత్రం హర్మన్ ఉంటుందని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.