ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ కు ఆ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఈ సీజన్ లో తన కోసం దయచేసి ఇలా చేయాలంటూ ఫ్యాన్స్ కు మెసేజ్ పంపించాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ లో తన కోసం ఛీర్ చేయాలని చెప్పాడు. కొత్త ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ నేడు (మార్చి 19) ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ విలేకర్ల సమావేశంలో హార్దిక్ మాట్లాడాడు.
గత సీజన్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ పాండ్య.. ఐపీఎల్ 2025 ఛాలెంజ్ కు సిద్ధమయ్యాడు. ఈ సీజన్ స్టార్టింగ్ కు ముందు ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. తనను ఎంకరేజ్ చేయాలని కోరాడు.
“జట్టుకు నేనెంతో ముఖ్యమని వాళ్లు (ఫ్యాన్స్) అంటే నేనూ ఒప్పుకొంటా. నేను బ్యాటింగ్‌కు వెళ్ళినప్పుడు, సిక్స్ కొట్టినప్పుడు, టాస్‌కు వెళ్ళినప్పుడు నాకోసం చప్పట్లు కొట్టండి. వాంఖేడే స్టేడియంలో మన రంగు (ముంబయి ఇండియన్స్) తప్ప వేరే రంగు నాకు కనబడొద్దు. అదే నా కోరిక” అని హార్దిక్ రిక్వెస్ట్ చేశాడు.
గత ఏడాది ఐపీఎల్ తర్వాత తన ప్రయాణం గురించి హార్దిక్ మాట్లాడాడు. “ఇది గొప్ప ప్రయాణం. కష్టతరమైందే అయినా ఎంటర్ టైనింగ్ కూడా. నేను ఎల్లప్పుడూ జట్టుకు ముఖ్యమైన ఆటగాడిని అని భావిస్తాను. నేను నా ఆల్‌రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తే, అది ఎల్లప్పుడూ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది” అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పేర్కొన్నాడు.
2024 ఐపీఎల్ సీజన్ కు ముందు రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ముంబయి ఇండియన్స్ జెర్సీలను రోహిత్ ఫ్యాన్స్ తగలబెట్టారు. మ్యాచ్ ల సమయంలో హార్దిక్ ను దారుణంగా ట్రోల్స్ చేశారు. హార్దిక్ ఎప్పుడు కనిపించినా ఎగతాళి చేశారు. ముఖ్యంగా వాంఖేడే స్టేడియంలో హార్దిక్ టాస్ కు వెళ్లినా.. బ్యాటింగ్, బౌలింగ్ కు వచ్చినా తీవ్రంగా బూయింగ్ చేశారు. దీనిపై మాజీ ఆటగాళ్లు, కోహ్లి లాంటి స్టార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫ్యాన్స్ వినలేదు.
ఏ వాంఖేడే స్టేడియంలో అయితే హార్దిక్ బూయింగ్ కు గురయ్యాడో అక్కడే హీరోలా నిలబడ్డాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. టీమ్ స్వదేశం చేరుకున్నాక వాంఖేడే స్టేడియంలోనే ఆటగాళ్లకు సన్మానం నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ లో ఫ్యాన్స్ అందరూ హార్దిక్ పేరుతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు విజయంలో హార్దిక్ తన వంతు పాత్ర పోషించాడు.
సంబంధిత కథనం