IPL 2024: హార్దిక్ పాండ్యా విషయంలో హైడ్రామా- మళ్లీ ముంబైకి వెళ్లడం ఖాయం! ఇదెక్కడి సస్పెన్స్ అంటున్న ఫ్యాన్స్-hardik pandya reportedly traded to mumbai indians to gujarat titans ahead of ipl 2024 ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Hardik Pandya Reportedly Traded To Mumbai Indians To Gujarat Titans Ahead Of Ipl 2024

IPL 2024: హార్దిక్ పాండ్యా విషయంలో హైడ్రామా- మళ్లీ ముంబైకి వెళ్లడం ఖాయం! ఇదెక్కడి సస్పెన్స్ అంటున్న ఫ్యాన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 27, 2023 07:41 AM IST

Hardik Pandya IPL 2024: గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, గుజరాత్ ప్రకటించిన రిటెన్షన్ లిస్టులో హార్దిక్ పేరు ఉండటంతో సందిగ్ధత ఏర్పడింది. అయినా, ట్రేడ్ ద్వారా ముంబైకి హార్దిక్ వెళతాడని తెలుస్తోంది. ఆ వివరాలివే..

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా

Hardik Pandya IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చే ఏడాది సీజన్ కోసం జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‍లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయంలో భారీ సస్పెన్స్ నడిచింది. గుజరాత్ కెప్టెన్‍గా ఉన్న హార్దిక్ పాండ్యా.. తన పాత టీమ్ అయిన ముంబై ఇండియన్స్‌కు వెళ్లనున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముంబై లిస్టులోనే హార్దిక్ పేరు ఉంటుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ పాండ్యాను కొనసాగించింది (రిటైన్ చేసుకుంది). టైటాన్స్ రిటైన్ లిస్టులో హార్దిక్ పేరు ఉంది. దీంతో కన్‍ఫ్యూజన్ ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు

రిటైన్ చేసుకునే, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను ప్రకటించేందుకు ఆదివారం సాయంత్రమే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గడువు ఉంది. దీంతో సాయంత్రమే లిస్టులను ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యను రిటైన్ చేసుకుంటున్నట్టు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. అయితే, ఈ లిస్టు వెల్లడించిన తర్వాత హార్దిక్ పాండ్యా కోసం ట్రేడ్ జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకోవడం పూర్తయిందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL 2024)లో తన పాత టీమ్ ముంబై ఇండియన్స్ తరఫునే హార్దిక్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

అయితే, హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో ఇంకా ఇరు ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఆటగాళ్ల ట్రేడింగ్‍ కోసం ఫ్రాంచైజీలకు డిసెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఉంది. దీంతో అప్పుడే హార్దిక్ పాండ్యా విషయంలో అధికారిక ప్రకటన రానుంది. ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్ 19న దుబాయ్‍లో జరగనుంది.

హార్దిక్ పాండ్యా కోసం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ముంబై ఇండియన్ రూ.15కోట్లతో పాటు అదనంగా ట్రాన్స్‌ఫర్ ఫీజును కూడా చెల్లించిందని సమాచారం. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్లేయర్ ట్రేడ్‍గా ఉంది.

ఆర్సీబీకి గ్రీన్

కాగా, హార్దిక్ పాండ్యా డీల్ కోసమే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‍ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసింది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్‍లో ఆర్సీబీ తరఫున గ్రీన్ ఆడనున్నాడు. 2022 మినీ వేలంలో రూ.17.5 కోట్లకు గ్రీన్‍ను ముంబై కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడిని ఆర్సీబీ పంపేసింది. అలాగే, జోఫ్రా ఆర్చర్‌ సహా 11 మందిని ముంబై రిలీజ్ చేసింది.

2015 నుంచి 2021 వరకు ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ తరఫునే హార్దిక్ పాండ్యా ఆడాడు. అయితే, 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెళ్లాడు. ఆ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. హార్దిక్ కెప్టెన్సీలో 2022 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించింది. ఈ ఏడాది సీజన్‍లోనూ ఫైనల్‍కు వరకు వెళ్లింది. వచ్చే ఏడాది ఐపీఎల్‍(IPL 2024)లో హార్దిక్ మళ్లీ ముంబైకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్ అవుతాడని అంచనాలు ఉన్నాయి.

హార్దిక్ పాండ్యా విషయంలో హైడ్రామా నడుస్తుండంతో ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయంపై పోస్టులు చేస్తున్నారు. ఇదెక్కడి సస్పెన్స్ అంటూ చాలా మంది స్పందిస్తున్నారు. ఇది ఐపీఎల్ మ్యాడ్ అంటూ కొందరు రాసుకొస్తున్నారు. రిటైన్ చేసుకున్న గంటల్లోనే ట్రేడ్ చేసేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీమ్స్ కూడా పేలుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం