Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో హార్దిక్ పాండ్యాకు చోటు కష్టమేనా.. ఛీఫ్ సెలక్టర్‌, కోచ్‌తో రోహిత్ శర్మ మీటింగ్-hardik pandya in t20 world cup 2024 team rohit sharma discussed with dravid and ajith agarkar ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో హార్దిక్ పాండ్యాకు చోటు కష్టమేనా.. ఛీఫ్ సెలక్టర్‌, కోచ్‌తో రోహిత్ శర్మ మీటింగ్

Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో హార్దిక్ పాండ్యాకు చోటు కష్టమేనా.. ఛీఫ్ సెలక్టర్‌, కోచ్‌తో రోహిత్ శర్మ మీటింగ్

Hari Prasad S HT Telugu
Apr 16, 2024 12:15 PM IST

Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా ఉంటాడా లేదా? దీనిపై చర్చించడానికే కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లతో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ కావడం గమనార్హం.

టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో హార్దిక్ పాండ్యాకు చోటు కష్టమేనా.. ఛీఫ్ సెలక్టర్‌, కోచ్‌తో రోహిత్ శర్మ మీటింగ్
టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో హార్దిక్ పాండ్యాకు చోటు కష్టమేనా.. ఛీఫ్ సెలక్టర్‌, కోచ్‌తో రోహిత్ శర్మ మీటింగ్ (AFP)

Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియాను ఎంపిక చేయడానికి గత వారమే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లతో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ముగ్గురూ సుమారు రెండు గంటల పాటు చర్చించడం గమనార్హం. అయితే ఈ చర్చ హార్దిక్ పాండ్యాపైనే నడిచినట్లు ఆ రిపోర్ట్ తెలిపింది.

హార్దిక్ పాండ్యా ఉంటాడా?

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం వచ్చే నెల మొదటి వారంలో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే గత వారం రోహిత్ శర్మ ముంబైలోనే ఉండటంతో ద్రవిడ్, అగార్కర్ లతో అతడు జట్టు ఎంపికపై మాట్లాడినట్లు ఆ రిపోర్టు చెప్పింది. మిగతా జట్టు ఎంపిక ఎలా ఉన్నా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనే సస్పెన్స్ నెలకొంది.

అతని బౌలింగ్ ఫిట్‌నెస్ పై ఇంకా సందేహాలు ఉండటమే దీనికి కారణం. అటు బ్యాట్ తోనూ ఈ సీజన్లో అతడు పెద్దగా రాణిస్తోంది ఏమీ లేదు. పైగా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత సొంత అభిమానుల నుంచే ఛీత్కారాలు ఎదురవుతున్న నేపథ్యంలో అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో హార్దిక్ గురించే రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ప్రత్యేకంగా చర్చించారు.

బ్యాటింగ్ లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న వాళ్లు చాలానే ఉన్నా.. అదే సమయంలో మూడో సీమర్ గా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయగలిగే బౌలర్ లేడు. ఇదే హార్దిక్ ప్రత్యేకత. దీంతో అతన్ని అంత తేలిగ్గా పక్కన పెట్టేయడానికి వీల్లేదు.

ఐపీఎల్ 2024లో హార్దిక్ కష్టాలు

అయితే హార్దిక్ పాండ్యా మాత్రం ఈ సీజన్ ఐపీఎల్లో దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ మధ్యే చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడు వేసిన చివరి ఓవర్లో ధోనీ హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టడంతో అతనిపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆరు మ్యాచ్ లలో అతడు రెండుసార్లు మాత్రమే తన 4 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. రెండు మ్యాచ్ లలో అసలు ఒక్క బాల్ కూడా వేయలేదు.

ఐపీఎల్ 2024లో హార్దిక్ 11 ఓవర్లు వేశాడు. అందులో కేవలం మూడు వికెట్లు తీయగా.. ఓవర్ కు ఏకంగా 12 పరుగులు ఇచ్చాడు. ఇదే కెప్టెన్ రోహిత్ శర్మను, సెలెక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్ లలో అతడు రెగ్యులర్ గా బౌలింగ్ చేసి రాణిస్తేనే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని వాళ్లు భావిస్తున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది.

హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

ఒకవేళ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోతే అతని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బెస్ట్ ఛాయిస్ అయితే శివమ్ దూబెనే. అతడు నిలకడగా ఆడుతున్నాడు. కానీ బౌలింగ్ లో ఏం చేస్తాడన్నదే పెద్ద ప్రశ్న. ఈ ఐపీఎల్లో అతడు ఒక్క బంతి కూడా వేయలేదు. సీఎస్కే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుతూ నేరుగా బ్యాటింగ్ కు దింపుతోంది.

వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్ లాంటి వాళ్లు కనిపిస్తున్నా.. వాళ్లు నిలకడగా రాణించే అనుమానమే. పైగా వీళ్లు కూడా ఈ సీజన్లో బంతితో చేసిందేమీ లేదు. దీంతో ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ స్థానానికి వచ్చిన ముప్పు ఏమీ కనిపించడం లేదు.

IPL_Entry_Point