IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియాపై మూడో టెస్టులో భారత్ గెలవాలంటే.. ఈ మూడు పనులు చేస్తే చాలన్న హర్భజన్ సింగ్
IND vs AUS 3rd Test: పెర్త్ టెస్టులో గెలిచిన భారత్ జట్టు.. అడిలైడ్ టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దాంతో గబ్బాలో జరిగే మూడో టెస్టుకి ఓ మూడు మార్పులు చేసుకోగలిగితే.. మళ్లీ భారత్ జట్టు సిరీస్‌లో పుంజుకోవచ్చని మాజీ క్రికెటర్ హర్భజ్ సింగ్ సూచించాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ శనివారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. గబ్బాలో భారత్ జట్టు గెలవాలంటే.. మూడు పనులు చేయాలని మాజీ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే జరిగిన పెర్త్ టెస్టులో భారత్ జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించగా.. గత ఆదివారం అడిలైడ్ వేదికగా ముగిసిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో సిరీస్ సమం అయ్యింది.
భాగస్వామ్యాలపై ఫోకస్
మూడో టెస్టు ముంగిట హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ‘‘గబ్బాలో భారత్ జట్టు బ్యాటర్లు కాస్త సహనంతో క్రీజులో నిలవాలి. కనీసం 30-40 పరుగుల చిన్న భాగస్వామ్యం నెలకొల్పడానికైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రయత్నించాలి. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక.. ఆ తర్వాత స్కోరు అదే వస్తుంది. తొలి టెస్టులో ఇలాంటి భాగస్వామ్యాలను చూశాం. గబ్బా మైదానంలో గెలవాలంటే.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కనీసం 300-350 పరుగులు చేయాలి’’ అని సూచించాడు.
ట్రావెస్ హెడ్ బలహీనత ఇదే
‘‘రెండో విషయం ఏమిటంటే గబ్బాలో వ్యూహత్మకంగా బౌలింగ్ చేయాలి. అడిలైడ్‌లో సెంచరీ బాది భారత్ జట్టుకి దూరం చేసిన ట్రావిస్ హెడ్ బౌన్సర్లను సమర్థంగా ఆడలేడు. అలానే అతను ఎక్కువగా పాయింట్, కవర్స్‌లో పరుగులు చేస్తుంటాడు. కాబట్టి.. బౌన్సర్లు సంధిస్తూనే అతను లెగ్ సైడ్ బాల్స్‌ను ఆడేలా టెంప్ట్ చేయాలి. అప్పుడు అతడ్ని సులువుగా అతడ్ని బోల్తా కొట్టించొచ్చు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
టీమ్‌లో అతనొస్తే బెటర్
‘‘మూడవ విషయం ఏమిటంటే బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలి. ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లో ఒకరికి గబ్బాలో ఛాన్స్ ఇవ్వాలి. అలా అని హర్షిత్ రాణా సరిగా బౌలింగ్ చేయడం లేదు అని నా ఉద్దేశం కాదు. కానీ.. బౌలింగ్ విభాగానికి కొత్తదనం జోడిస్తే బాగుంటుంది. గబ్బా పిచ్‌లో వేగం, బౌన్స్ కూడా ఉంటుంది. కాబట్టి.. బౌన్స్‌ను రాబట్టే సామర్థ్యం ఉన్న ప్రసీద్ టీమ్‌లో ఉంటే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చు’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
భారత్ జట్టు ఈ మూడు మార్పులను చేసుకోగలిగితే.. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాపై విజయం సాధించొచ్చని హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.