Harbhajan on Dhoni: ఎమ్మెస్ ధోనీ తన 18వ ఐపీఎల్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. తొలి సీజన్ నుంచి ఈ మెగా లీగ్ లో ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్.. ఇప్పుడు 43 ఏళ్ల వయసులో ఎంతో ఒత్తిడి ఉండే, ఫిట్‌నెస్ కు పరీక్ష పెట్టే లీగ్ లో మరోసారి బరిలోకి దిగబోతున్నాడు. మరి దీనికి కారణం ఏంటి అన్నది తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
ఎమ్మెస్ ధోనీ వయసు 43 అయినా.. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 11 ఇన్నింగ్స్ లో ఏకంగా 220.54 స్ట్రైక్ రేటుతో 161 రన్స్ చేశాడు. సగటు 53.66 కావడం విశేషం. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈఎస్పీఎన్‌క్రికిన్ఫోతో మాట్లాడుతూ.. అసలు ధోనీ ఇంకా ఐపీఎల్లో ఎందుకు కొనసాగుతున్నాడో వివరించాడు.
“నేను ఈ మధ్యే ఓ పెళ్లిలో ధోనీని కలిశాను. అతడు చాలా ఫిట్ గా, దృఢంగా కనిపించాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కష్టంగా అనిపించడం లేదా అని నేను అతన్ని అడిగాను. కష్టమే కానీ తనకు ఇది ఇష్టమైన పని అని అన్నాడు. క్రికెట్ ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సాయంత్రం 4 లేదా 5 అవగానే బయటకు వెళ్లి ఆడాలనిపిస్తుంది. అందుకే ఆడుతూనే ఉన్నాను అని ధోనీ చెప్పాడు. ఆ ఆకలి మనలో ఉన్నంత వరకు ఆడటంలో తప్పేమీ లేదు” అని హర్భజన్ అన్నాడు.
ధోనీ గతేడాది 42 ఏళ్ల వయసులోనూ బౌలర్లను డామినేట్ చేస్తూ పరుగులు చేసిన విధానం అద్భతమనే చెప్పాలి. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా.. ఐదేళ్లుగా ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. ఈ ఐదేళ్లలో అతడు ఐపీఎల్ తప్ప మధ్యలో మరే ఇతర క్రికెట్ ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రారంభానికి రెండు, మూడు నెలల ముందు నుంచే అతడు చేసే కఠోర సాధన లీగ్ లో పనికొస్తుందని భజ్జీ వెల్లడించాడు.
“మధ్యలో ఎలాంటి క్రికెట్ ఆడకుండా ఉండటం కష్టమే. కానీ అలా ఎలా ఆడాలో కూడా చేసి చూపిస్తున్నాడు. మిగిలిన వాళ్లతో పోలిస్తే కచ్చితంగా ఏదో మెరుగ్గానే చేస్తున్నాడు. అతడు క్రీజులో కేవలం ఔట్ కాకుండా ఉండటం లేదు. అందరు బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి రెండు, మూడు నెలల ముందు నుంచే అతడు చాలా బంతులను ఎదుర్కొంటాడు” అని హర్భజన్ సింగ్ తెలిపాడు.
సంబంధిత కథనం