Harbhajan Singh: పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ సిక్కులపై నోరు పారేసుకోవడంపై హర్భజన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డాడు. తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా అతన్ని కడిగి పారేశాడు. సిగ్గుండాలి అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు దిగి వచ్చి క్షమాపణ చెప్పాడు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చివరి ఓవర్ ను అర్ష్‌దీప్ సింగ్ వేసిన సందర్భంగా అక్మల్.. సిక్కుల గురించి నోరు జారాడు.
హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్మల్ దిగి వచ్చాడు. మంగళవారం (జూన్ 11) అతడు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశాడు. "ఈ మధ్య నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్ తోపాటు సిక్కు సమాజానికి క్షమాపణలు చెబుతున్నాను. నా మాటలు సరి కావు. ఇవి అగౌరవపరిచేవే. ప్రపంచంలోని సిక్కులందరిపైనా నాకు గౌరవం ఉంది. ఎవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను" అని అక్మల్ ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా తన ట్వీట్ కు హర్భజన్ సింగ్ ను కూడా కమ్రాన్ అక్మల్ ట్యాగ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అక్మల్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
ఆ మ్యాచ్ సందర్భంగా ఓ లైవ్ టీవీ చర్చలో కమ్రాన్ అక్మల్.. అర్ష్‌దీప్ సింగ్, సిక్కుల గురించి నోరు పారేసుకున్నాడు. చివరి ఓవర్ అర్ష్‌దీప్ వేయడంతో అక్మల్ స్పందిస్తూ.. "ఏదైనా జరగొచ్చు.. చివరి ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేయాలి. ఎలాగూ అతని రిథమ్ సరిగా లేదు. 12 కూడా అయిపోయింది" అని అక్మల్ నవ్వుతూ అన్నాడు. సిక్కులపై అర్ధరాత్రి 12 గంటల టైమ్ కు సంబంధించి ఎన్నో జోకులు సర్క్యులేట్ అవుతుంటాయి.
వాళ్లు ఆ సమయంలోనే తమ కంటే ఎంతో శక్తివంతులైన మొఘల్స్ పై దండయాత్ర చేసేవారని పేరు. నిజానికి ఇది వాళ్ల వీరత్వాన్ని సూచించేది అయినా.. దానిని ఓ జోక్ గా చెలామణిలోకి తెచ్చారు. ఇప్పుడు అక్మల్ కూడా అలాగే అర్ష్‌దీప్ సింగ్, సిక్కులపై నోరు పారేసుకున్నాడు. దీనిని భజ్జీ తీవ్రంగా ఖండించాడు.
"కమ్రాన్ అక్మల్ నీకు సిగ్గుండాలి. నీ చెత్త నోరు తెరిచే ముందు నువ్వు సిక్కుల చరిత్ర తెలుసుకోవాల్సింది. మా సిక్కులు చొరబాటుదారుల నుంచి మీ తల్లులు, చెళ్లెల్లను రక్షించారు. అది 12 గంటల సమయంలో. మీకు సిగ్గుండాలి. కాస్తయినా కృతజ్ఞత చూపండి" అని భజ్జీ తీవ్రంగా స్పందించాడు. దీంతో అక్మల్ దిగి వచ్చి సిక్కులందరికీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా ఆరు పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ సింగ్ 10 పరుగులే ఇచ్చాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో పాక్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టే దుస్థితిలో ఉంది.