Happy Retirement: ట్రెండింగ్‍లో హ్యాపీ రిటైర్మెంట్.. రోహిత్ శర్మపై నెటిజన్ల అసంతృప్తి.. కోహ్లీపై కూడా..-happy retirement trending on social media after rohit sharma and virat kohli failure in india vs australia 4th test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Happy Retirement: ట్రెండింగ్‍లో హ్యాపీ రిటైర్మెంట్.. రోహిత్ శర్మపై నెటిజన్ల అసంతృప్తి.. కోహ్లీపై కూడా..

Happy Retirement: ట్రెండింగ్‍లో హ్యాపీ రిటైర్మెంట్.. రోహిత్ శర్మపై నెటిజన్ల అసంతృప్తి.. కోహ్లీపై కూడా..

IND vs AUS 4th Test - Happy Retirement: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హ్యాపీ రిటైర్మెంట్ అని ట్రోల్ చేస్తున్నారు.

Happy Retirement: ట్రెండింగ్‍లో హ్యాపీ రిటైర్మెంట్.. రోహిత్ శర్మపై నెటిజన్ల అసంతృప్తి.. కోహ్లీపై కూడా.. (AP)

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం పేలవమైన ఫామ్‍లో ఉన్నాడు. పరుగులు చేయలేక తంటాలు పడుతూ విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ ఘోర ప్రదర్శన చేస్తున్నాడు. మెల్‍బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే కొనసాగింది. కీలకమైన చివరి రోజైన నేడు (డిసెంబర్ 30) రోహిత్ 9 పరుగులకే ఔటయ్యాడు. ఈ సిరీస్‍లో హిట్‍మ్యాన్ వైఫల్యం కొనసాగింది.

రోహిత్ దారుణమైన ఫామ్

టీిమిండియా సారథి రోహిత్ శర్మ నాలుగు నెలలుగా దారుణమైన ఫామ్‍లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఈ టెస్టు సిరీస్‍లో తొలి మ్యాచ్ మిస్ అయిన రోహిత్ తదుపరి మూడు టెస్టులు ఆడాడు. అయితే, మూడు టెస్టుల్లో కేవలం 31 పరుగులే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లో ఒక్కసారే రెండంకెల స్కోరు చేశాడు. రోహిత్ వైఫల్యం ఎఫెక్ట్ టీమిండియాపై ఎక్కువగా పడుతోంది. ఇక గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ కేవలం 10.93 యావరేజ్‍తో 164 రన్సే చేశాడు. మెల్‍బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో ఘోరంగా నిరాశపరిచాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హ్యాపీ రిటైర్మెంట్ అంటూ..

రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక రిటైర్మెంట్ ఇచ్చేసి యువ ఆటగాళ్లకు దారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ ఔటయ్యే తీరును చూస్తుంటే.. ఇక అతడు తప్పుకోవడమే మేలు అనిపిస్తోందని చాలా మంది ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్లు చేస్తున్నారు. హ్యాపీ రిటైర్మెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. హిట్‍మ్యాన్ చాలా ఏళ్లుగా గొప్పగా ఆడుతున్నారని, అయితే ఇప్పుడు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందని కొందరు రాసుకొస్తున్నారు.

దీంతో హ్యాపీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆసీస్‍తో ఐదో టెస్టు ముందే హిట్‍మ్యాన్ తప్పుకోవాలని కూడా కొందరు సూచిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వగా.. రోహిత్ శర్మ కూడా అదే ఫాలో అవ్వాలని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

కోహ్లీపైనా ఫ్యాన్స్ ఫైర్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కూడా చాలా మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 5 పరుగులకే ఔటయ్యాడు. మళ్లీ ఔట్ సైడ్ ఆఫ్ బంతిని ఆడి స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇటీవలి కాలంలో ఈ విధంగానే కోహ్లీ చాలాసార్లు ఔట్ అవుతున్నాడు. ఇది అభిమానులు చిరాకు తెప్పిస్తోంది. కోహ్లీ కూడా ప్రస్తుత సిరీస్‍లో గొప్ప ఫామ్‍లో లేడు. ఈ సిరీస్ తొలి టెస్టులో సెంచరీ చేయడం మినహా ఆ తర్వాత బిగ్ స్కోర్స్ చేయలేకపోయాడు. టెస్టుల్లో గత మూడేళ్లుగా తన స్థాయి ఆట ఆడలేకున్నాడు. దీంతో కోహ్లీ కూడా రిటైర్ అవ్వాలంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ పోస్టులు చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు చివరి రోజున భారత్ ముందు 340 పరుగుల టార్గెట్ ఉంది. 48 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 99 పరుగులు చేసింది భారత్. యశస్వి జైస్వాల్ (59 నాటౌట్), రిషబ్ పంత్ (19 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా నేడు 44 ఓవర్ల ఆట సాగనుంది. ఫలితం వస్తుందా.. డ్రా అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనం