Happy Birthday Virat Kohli: కోహ్లి ఓ లెజెండ్: విరాట్‌కు ద్రవిడ్, గిల్, హార్దిక్ స్పెషల్ బర్త్ డే విషెస్
Happy Birthday Virat Kohli: కోహ్లి ఓ లెజెండ్ అంటూ విరాట్‌కు ద్రవిడ్, గిల్, హార్దిక్ స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఐసీసీ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ వీడియో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది.
Happy Birthday Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు సహచరులు శుభ్‌మన్ గిల్, అశ్విన్, హార్దిక్ పాండ్యా విషెస్ చెప్పారు. వాళ్ల స్పెషల్ విషెస్ తో కూడిన వీడియోను ఐసీసీ రిలీజ్ చేసింది. ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లి ఓ లెజెండ్ అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనికి బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం. అన్ని ఫార్మాట్లలో అయినా కూడా ముఖ్యంగా వన్డేల్లో మాత్రం కోహ్లి ఓ లెజెండ్ అని, కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్లో అతడు ఆడిన తీరు ఈ జనరేషన్ క్రికెటర్లకు ఓ బెంచ్ మార్క్ లాంటిదని ఈ వీడియోలో ద్రవిడ్ అన్నాడు.
ఇండియన్ క్రికెట్ డీఎన్ఏనే మార్చిన ఘనత కోహ్లికి దక్కుతుందని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బర్త్ డే విషెస్ లో చెప్పాడు. ఇక ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. కోహ్లిలాగా పరుగులు చేయాలన్న ఆకలి, ప్యాషన్ మరొకరిలో చూడలేదని అన్నాడు. దీనికి ఎవరూ సరితూగరని అతడు స్పష్టం చేశాడు.
ఇక పేస్ బౌలర్ బుమ్రా కూడా కోహ్లికి విషెస్ చెప్పాడు. "ఇన్నేళ్లయినా కూడా ఆట పట్ల అతనిలో అంకితభావం, ఆ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది. నేను కూడా దీని నుంచి నేర్చుకోవాలి. ఆటను చూస్తున్న ఎంతో మంది కూడా అతని నుంచి ఎంతో నేర్చుకుంటారు" అని బుమ్రా అన్నాడు.
ఇక హార్దిక్ విషెస్ చెబుతూ.. "అతనికి ఫిట్‌నెస్ కల్చర్ ఉంది. ఆ బాండ్ ఉంది. ఎప్పుడూ ఆటలోనే ఉంటాడు. అదే మాలో స్ఫూర్తి నింపుతుంది. అదే సమయంలో కోట్లాది మంది అభిమానులు కూడా ప్రేరణ పొందుతారు" అని అన్నాడు.
విరాట్ కోహ్లి 35వ పుట్టిన రోజు నాడే వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో ఇండియా తలపడుతోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న ఇండియా.. టాప్ ప్లేస్ లో కొనసాగడానికి ఈ మ్యాచ్ లోనూ గెలవడం చాలా ముఖ్యం. అదే సమయంలో తన బర్త్ డేనాడే అతడు సచిన్ 49 సెంచరీల రికార్డును కూడా అందుకుంటాడన్న ఆశతో అభిమానులు ఉన్నారు.