Hanuma Vihari vs ACA: విహారి అందరినీ బూతులు తిడతాడు: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేట్‌మెంట్ ఇదీ-hanuma vihari vs andhra cricket association official statement from the cricket body accuses vihari of verbal abuse ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Hanuma Vihari Vs Andhra Cricket Association Official Statement From The Cricket Body Accuses Vihari Of Verbal Abuse

Hanuma Vihari vs ACA: విహారి అందరినీ బూతులు తిడతాడు: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేట్‌మెంట్ ఇదీ

Hari Prasad S HT Telugu
Feb 27, 2024 09:36 AM IST

Hanuma Vihari vs ACA: టీమిండియా క్రికెటర్ హనుమ విహారి, మరో క్రికెటర్ పృథ్వీరాజ్ వివాదంపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) స్పందించింది. విహారిపై ఆ అసోసియేషన్ మరిన్ని నిందలు మోపింది.

హనుమ విహారి అందరినీ బూతులు తిడతాడంటూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆరోపణ
హనుమ విహారి అందరినీ బూతులు తిడతాడంటూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆరోపణ (Getty)

Hanuma Vihari vs ACA: టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి ఇక ఆంధ్రాకు ఆడనని, అక్కడ తనకు గౌరవం లేదని చెప్పిన సంగతి తెలుసు కదా. ఓ రాజకీయ నాయకుడి కొడుకు, ఆంధ్రా టీమ్ ప్లేయర్ వల్లే తన కెప్టెన్సీ ఊడిందని అతడు చెప్పాడు. దీనికి సదరు క్రికెటర్ పృథ్వీరాజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ఈ ఇద్దరి గొడవపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. అయితే అక్కడి అసోసియేషన్ విహారినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది.

ట్రెండింగ్ వార్తలు

విహారి vs ఏసీఏ

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ చేతుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఓడిన తర్వాత హనుమ విహారి రిలీజ్ చేసిన స్టేట్‌మెంట్ అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో బెంగాల్ తో ఆడుతున్న సందర్భంలో తాను ఓ ప్లేయర్ ను మందలించానని, అతడు ఓ రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో తనను కెప్టెన్సీ నుంచి దిగిపోవాల్సిందిగా ఏసీఏ పెద్దలు ఆదేశించినట్లు విహారి చెప్పాడు.

తనకు గౌరవం లేని చోట ఇక ఉండనని, మరెప్పుడూ ఆంధ్రా టీమ్ కు ఆడబోనని స్పష్టం చేశాడు. దీనిపై స్పందించిన సదరు క్రికెటర్ పృథ్వీరాజ్.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని, ఇంతకు మించి నువ్వు పీకేదేమీ లేదని చాలా ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇక తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కూడా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఏసీఏ ప్రకటన ఇదీ..

నిజానికి ఈ ప్రకటనను కూడా విహారియే తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇలాంటివి ప్రయత్నిస్తూనే ఉండండి అంటూ సెటైర్ వేస్తూ ఆ ప్రకటనను షేర్ చేశాడు. అందులో విహారి లక్ష్యంగా ఏసీఏ విమర్శలు గుప్పించింది.

"ఈ వివాదంపై స్పందించాలని భావించాం. బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా మిస్టర్ విహారి ఓ ప్లేయర్ ను అందరి ముందు వ్యక్తిగతంగా దూషించినట్లు మా దృష్టికి వచ్చింది. బాధిత ప్లేయర్ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. జనవరి 2024లో ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి ఓ మెయిల్ వచ్చింది.

విహారి ఇండియన్ టీమ్ కు ఆడే అవకాశాల వల్ల సీజన్ మొత్తం అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను ప్రతిపాదించారు. విహారి కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాడు. దీంతో రిక్కీ భుయిని కొత్త కెప్టెన్ గా సీనియర్ సెలక్షన్ కమిటీ నియమించింది" అని ఏసీఏ స్పష్టం చేసింది.

అంతేకాదు విహారిపైనా ఆరోపణలు గుప్పించింది. విహారి బూతులు తిడతాడని, అతని తీరు దారుణంగా ఉందని టీమ్మేట్స్, సపోర్ట్ స్టాఫ్, ఏసీఏ అడ్మినిస్ట్రేటర్ల నుంచి కూడా ఫిర్యాదులు అందినట్లు ఏసీఏ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇతర రాష్ట్ర జట్లకు ఆడటం కోసం విహారి తరచూ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతాడని, ఆ వెంటనే మనసు మార్చుకుంటాడని కూడా ఆరోపించింది. మరి ఈ ఆరోపణలు, విమర్శలపై విహారి ఎలా స్పందిస్తాడో చూడాలి.

WhatsApp channel