ఐపీఎల్ 2025 సీజన్ కు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సరికొత్తగా సిద్ధమవుతున్నాడు. కొత్త టీమ్ తరపున సత్తాచాటాలనే టార్గెట్ తో ఉన్నాడు. మెగా వేలానికి ముందు సిరాజ్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ ఈ పేసర్ ను కొనుక్కుంది. తాజాగా గుజరాత్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో సిరాజ్ చెలరేగాడు. అతని బౌలింగ్ క్లిప్ ను గుజరాత్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
గుజరాత్ టైటాన్స్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ తో అదరగొట్టాడు. కచ్చితమైన యార్కర్లు వేశాడు. గుడ్ లెంగ్త్ లో బంతులేశాడు. బ్యాటర్లను భయపెట్టాడు. తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాటర్లు అతని బౌలింగ్ ఆడలేకపోయారు. ఈ వీడియోను ‘‘15 సెకన్ల కంప్లీట్ మియా మ్యాజిక్’’ అని గుజరాత్ టైటాన్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఐపీఎల్ 2025లో సిరాజ్ కొత్త టీమ్ కు ఆడబోతున్నాడు. ఏడేళ్లుగా ఈ లీగ్ లో ఆర్సీబీకి ఆడిన అతను.. ఇకపై గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎటాక్ లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆర్సీబీతో కోహ్లి, సిరాజ్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఈ హైదరాబాదీ బౌలర్ ను రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ ఏకంగా రూ.12.25 కోట్లు పెట్టి సిరాజ్ ను కొనుక్కుంది.
ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున సిరాజ్ 83 వికెట్లు పడగొట్టాడు. 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఒక సీజన్ ఆడి, ఆరు మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసుకున్న సిరాజ్‌ను ఆర్సీబీ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2018 నుంచి 2024 వరకు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ 87 మ్యాచ్ ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ ఫిగర్స్ 4/21.
ఆర్సీబీ తరపున సిరాజ్ నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాడు. కానీ ఎప్పుడూ ట్రోఫీ గెలవలేదు. 2023 అతని ఉత్తమ సీజన్. 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసుకున్నాడు. 19.74 సగటు నమోదు చేశాడు. గత సీజన్ లో సిరాజ్ 14 మ్యాచ్‌లలో 33.07 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు.
గతేడాది ఐపీఎల్ తో పాటు ఆ తర్వాత టీమిండియా తరపునా సిరాజ్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిరాజ్ ను భారత జట్టుకు ఎంపిక చేయలేదు. చివరగా విదర్భతో రంజీ మ్యాచ్ ఆడిన అతను రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం