ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ దూకుడు కొనసాగుతోంది. మధ్యలో లీగ్ కు బ్రేక్ వచ్చినా జీటీ ఆధిపత్యం మాత్రం అలాగే ఉంది. ఐపీఎల్ 18వ సీజన్ లో ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్ గా గుజరాత్ నిలిచింది. ఆదివారం (మే 18) ఆ టీమ్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుచేసింది.
సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అమేజింగ్ బ్యాటింగ్ తో గుజరాత్ ను గెలిపించారు. 200 రన్స్ ఛేజింగ్ లో జీటీ ఒక్క వికెట్టూ కోల్పోకుండా 19 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. ఈ విక్టరీతో జీటీ (18 పాయింట్లు), ఆర్సీబీ (17), పంజాబ్ కింగ్స్ (17) ప్లేఆఫ్స్ చేరాయి. ఇక మిగిలిన ఒక్క బెర్తు కోసం ఎంఐ, డీసీ, ఎల్ఎస్జీ పోటీపడతాయి.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఛేజింగ్ లో గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అదరగొట్టారు. బౌండరీల మోత మోగిస్తూ ఈ జంట పరుగులు రాబట్టింది. ఢిల్లీ బౌలర్లను చితకబాదింది. సాయి, గిల్ కచ్చితమైన టైమింగ్ తో షాట్లు కొట్టారు.
ప్రత్యర్థి హోం గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ కొనసాగించారు. వికెట్ ఇవ్వకూడదనే పట్టుదల ప్రదర్శించారు. నటరాజన్ ఓవర్లో సాయి వరుసగా 6, 4, 4 దంచాడు. అదే ఓవర్లో మరో ఫోర్ కొట్టాడు. ఆరంభంలో గిల్ కాస్త నెమ్మదిగా ఆడాడు. పవర్ ప్లేలో జీటీ 59 పరుగులు చేసింది.
మధ్యలో జీటీ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించినట్లు కనిపించింది. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జోరందుకోవడంతో బౌండరీల మోత మోగింది. స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్ బౌలింగ్ లో గిల్ సిక్సర్లు కొట్టాడు. హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్న సాయి, గిల్ టీమ్ ను విజయం దిశగా నడిపించారు.
గుజరాత్ టైటాన్స్ విజయ సమీకరణం 24 బంతుల్లో 35 పరుగులుగా మారింది. కానీ వెంటనే నటరాజన్ వేసిన 17వ ఓవర్లో సుదర్శన్ ఫోర్.. గిల్ వరుసగా 4, 6 కొట్టాడు. ఆ ఓవర్లో 18 రన్స్ రావడంతో సమీకరణం 18 బంతుల్లో 17 పరుగులుగా మారింది. ఆ తర్వాత కుల్ దీప్ బౌలింగ్ లో సిక్సర్ తో సాయి సుదర్శన్ సెంచరీ చేరుకున్నాడు. తర్వాతి ఓవర్లో సిక్సర్ తో సుదర్శన్ మ్యాచ్ ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో కేెఎల్ రాహుల్ అదరగొట్టాడు. అజేయ శతకంతో టీమ్ కు భారీ స్కోరు అందించాడు. 65 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసిన కేఎల్.. 14 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది.
సంబంధిత కథనం