ముంబయి ధమాకా.. గుజరాత్ ఔట్.. థ్రిల్లింగ్ ఎలిమినేటర్ లో టైటాన్స్ పై ఇండియన్స్ విజయం.. సాయి సుదర్శన్ పోరాటం వృథా-gujarat titans out of ipl 2025 lose match with mumbai indians by 20 runs eliminator sai sudharsan boult bumrah gleeson ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ముంబయి ధమాకా.. గుజరాత్ ఔట్.. థ్రిల్లింగ్ ఎలిమినేటర్ లో టైటాన్స్ పై ఇండియన్స్ విజయం.. సాయి సుదర్శన్ పోరాటం వృథా

ముంబయి ధమాకా.. గుజరాత్ ఔట్.. థ్రిల్లింగ్ ఎలిమినేటర్ లో టైటాన్స్ పై ఇండియన్స్ విజయం.. సాయి సుదర్శన్ పోరాటం వృథా

వాట్ ఏ థ్రిల్లర్. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబయి ఇండియన్స్ గెలిచింది. ఈ మ్యాచ్ లో ఓటమితో టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబయి ఫైనల్లో ప్లేస్ కోసం క్వాలిఫయర్ 2 ఆడనుంది.

ముంబయి సంచలన విజయం (AFP)

అయిదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ దే పైచేయి. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు షాక్ తప్పలేదు. ఐపీఎల్ 2025 నుంచి జీటీ నిష్క్రమించింది. శుక్రవారం (మే 30) ముల్లాన్ పూర్ లో జరిగిన ఎలిమినేటర్ లో ముంబయి 20 పరుగుల తేడాతో టైటాన్స్ ను ఓడించింది. 229 పరుగుల ఛేజింగ్ లో ఆ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, ఓ సిక్సర్), వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా జీటీని గెలిపించలేకపోయారు. బౌల్ట్ రెండు వికెట్లు తీశారు. ఇక ఫైనల్లో ప్లేస్ కోసం పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయర్ 2లో ముంబయి ఆదివారం (జూన్ 1) తలపడుతుంది.

ఫస్ట్ ఓవర్లోనే షాక్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో భారీ టార్గెట్ ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న జీటీ కెప్టెన్ శుభ్ మన్ గిల్ (1)ను బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చకున్నాడు. బట్లర్ స్థానంలో టీమ్ లోకి వచ్చిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; ఓ ఫోర్, 2 సిక్సర్లు) బాది వెళ్లిపోయాడు. అతను క్రీజు లోపలికి జరిగి హిట్ వికెట్ గా ఔటవడం గమనార్హం.

సుదర్శన్, సుందర్ నిలబడి

6.2 ఓవర్లకు జీటీ 67/2తో నిలిచింది. అప్పటికే సెన్సేషనల్ ఫామ్ కొనసాగిస్తూ అదరగొడుతున్న సాయి సుదర్శన్.. అక్కడి నుంచి వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి పోరాడాడు. ఈ జోడీ ముంబయి బౌలింగ్ ను చిత్తుచేసింది. ఎడాపెడా బౌండరీలు బాదింది. బుమ్రా బౌలింగ్ లోనూ సత్తాచాటింది. మూడో వికెట్ కు 44 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు సుదర్శన్, సుందర్.

బుమ్రా యార్కర్

13 ఓవర్లకు 148/2తో టార్గెట్ దిశగా ముంబయి ఇండియన్స్ దూసుకెళ్లింది. ఆ సమయంలో బుమ్రా కళ్లుచెదిరే యార్కర్ తో సుందర్ ను బౌల్డ్ చేశాడు. ఆ బంతిని సుందర్ ఆడలేకపోయాడు. ఆ కాసేపటికే స్కూప్ షాట్ కు ప్రయత్నించి సుదర్శన్ బౌల్డ్ కావడంతో ఉత్కంఠ రేగింది. జీటీ టీమ్ లో టెన్షన్ పెరిగింది.

ఆ మూడు ఓవర్లు

జీటీ విజయానికి లాస్ట్ 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. రాహుల్ తెవాటియా ఓ సిక్సర్ కొట్టినా బుమ్రా వేసిన 18వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 36 పరుగులుగా మారింది. బౌలింగ్ కు వచ్చిన బౌల్ట్ తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్ కే రూథర్ ఫర్డ్ (24) ను ఔట్ చేసి గుజరాత్ ను దెబ్బకొట్టాడు.

జీటీ గెలవాలంటే లాస్ట్ ఓవర్లో 24 రన్స్ చేయాల్సిన పరిస్థితి. కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూనే అద్భుతంగా బౌలింగ్ చేసిన గ్లీసన్ ఫస్ట్ మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు. 3 బాల్స్ లో 21 రన్స్ చేయాల్సి రావడంతో జీటీ పనైపోయింది. కండరాల నొప్పితో గ్లీసన్ బయటకు వెళ్లిపోవడంతో మిగిలిన మూడు బంతులను అశ్వని కుమార్ వేశాడు. నాలుగో బంతికి షారుక్ ఖాన్ ను ఔట్ చేసిన అతను.. ఒక్క పరుగూ ఇవ్వలేదు. ఓటమితో జీటీ ప్లేయర్స్, ఫ్యాన్స్ బాధలో మునిగిపోయారు.

రోహిత్ ధనాధన్

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఈ సీనియర్ ఓపెనర్ 50 బంతుల్లో 81 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. రోహిత్ మెరుపులతో ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (47), సూర్యకుమార్ (33), హార్దిక్ పాండ్య (22 నాటౌట్) కూడా మెరిశారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం