శుక్రవారం (మే 2) సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. రెండు సార్లు అంపైర్లపైకి ఫైర్ అయ్యాడు. తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో, ఆ తర్వాత ఫీల్డింగ్ లో అంపైర్లతో కోపంతో మాట్లాడాడు గిల్. ఇప్పుడీ వీడియోలు వైరల్ గా మారాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆ ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. సెంచరీ చేసేలా కనిపించిన గిల్.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అనూహ్యంగా రనౌటయ్యాడు. థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
అయితే వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెక్ గ్లవ్స్ వికెట్లకు దగ్గరగా వచ్చాయని, ఆ టైమ్ బంతి స్టంప్స్ కు తాకలేదని గిల్ వాదించాడు. వివాదాస్పద రన్ అవుట్ తర్వాత, బ్యాట్స్‌మన్ గుజరాత్ డగ్అవుట్ దగ్గర నాల్గవ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్ లో మరోసారి గిల్ కు కోపమొచ్చింది. అది 14వ ఓవర్ నాలుగవ బంతి. అభిషేక్ శర్మ తన క్రీజ్‌ను దాటి వెళ్ళాడు. అయితే, ప్రసిద్ధ్ కృష్ణ ఖచ్చితమైన యార్కర్ వేశాడు. అభిషేక్ శర్మ షూపై బంతి తగిలింది. ఆటగాళ్లు ఎల్బీ అప్పీల్ చేయగా.. అంపైర్ ఇవ్వలేదు. గిల్ రివ్యూ తీసుకున్నాడు.
బాల్ ట్రాకింగ్ అంపైర్ కాల్ అని చూపించింది. దీంతో అభిషేక్ బతికిపోయాడు. ఇది గుజరాత్ కెప్టెన్‌కు ఏమాత్రం నచ్చలేదు. అసలు బాల్ ట్రాకింగ్ అంపైర్ కాల్ అని ఎలా వస్తుందని మరోసారి అంపైర్లతో గిల్ వాగ్వాదానికి దిగాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అంపైర్లతో వాగ్వాదం గురించి శుభ్‌మన్ గిల్ స్పందించాడు. తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయానని ఒప్పుకొన్నాడు. కానీ కొన్ని సార్లు గ్రౌండ్ లో గొప్పగా ఆడుతున్న సమయంలో ఇలాంటి ఎమోషన్స్ ఉండటం ఖాయమేనని అన్నాడు.
“నాకు, అంపైర్‌కు కొంత చర్చ జరిగింది, కొన్నిసార్లు మీరు మీ 110 శాతం ఇచ్చినప్పుడు చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఎమోషన్స్ బయటకు రావడం ఖాయమే’’ అని గిల్ చెప్పాడు. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించింది. 14 పాయింట్లతో పట్టికలో సెకండ్ ప్లేస్ లో ఉంది.
సంబంధిత కథనం