Gongadi Trisha: అండర్ 19 వరల్డ్ కప్ స్టార్ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
Gongadi Trisha: అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి టీమిండియాను విజేతగా నిలిపిన తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించింది ప్రభుత్వం. బుధవారం (ఫిబ్రవరి 5) ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది.
Gongadi Trisha: అండర్ 19 వరల్డ్ కప్ స్టార్ గొంగడి త్రిష ఈరోజు (ఫిబ్రవరి 5) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది.ఈ సందర్భంగా ఆమె అద్భుత ప్రదర్శనపై అభినందించిన ఆయన.. త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించారు. ఇండియా అండర్ 19 వుమెన్స్ టీమ్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. ఆమె తెలంగాణలోని భద్రాచలానికి చెందిన ప్లేయర్ అనే విషయం తెలిసిందే.

త్రిషకు రూ.కోటి నజరానా
అండర్ 19 టీ20 వరల్డ్ కప్ గెలిచి వచ్చిన ఇండియన్ వుమెన్స్ టీమ్ కు ఇప్పటికే ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన ఈ మెగా టోర్నీని వరుసగా రెండోసారి ఇండియన్ వుమెన్స్ అండర్ 19 టీమ్ గెలిచింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష.. బుధవారం (ఫిబ్రవరి 5) సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా త్రిషను సీఎం అభినందించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింత రాణించాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.కోటి నజరానా ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు ఇదే జట్టులో సభ్యురాలైన ధ్రుతి కేసరికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. వీళ్లకే కాకుండా అండర్ 19 టీమ్ హెడ్ కోచ్ నౌసీన్, ట్రైనర్ షాలినీలకు కూడా చెరో రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
సీఎం రేవంత్ తోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిం తదితరులు కూడా ఉన్నారు.
అండర్ 19 వరల్డ్ కప్‌లో త్రిష ప్రదర్శన ఇలా..
వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన ప్లేయర్ గానూ రికార్డు క్రియేట్ చేసింది. టోర్నీలో అత్యధిక స్కోరర్ కూడా ఆమెనే. ఆమె 7 ఇన్నింగ్స్ లో 309 రన్స్ చేసింది.
ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ కూడా ఆమెకే దక్కింది. త్రిష భద్రాచలానికి చెందిన ప్లేయర్. ఆమె ప్రతిభను గుర్తించిన తండ్రి త్రిష చిన్న వయసులోనే హైదరాబాద్ కు వచ్చి ఆమెకు క్రికెట్ కోచింగ్ ఇప్పించారు. ఇప్పుడామె ఏకంగా అండర్ 19 ఇండియన్ టీమ్ లో అద్భుతంగా రాణిస్తోంది. ఏకంగా అండర్ 19 వరల్డ్ కప్ లో గెలవడంలోనే కీలకపాత్ర పోషించి అబ్బురపరిచింది.
సంబంధిత కథనం