Gongadi Trisha: అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌లో తెలంగాణ అమ్మాయి విశ్వరూపం.. తొలి సెంచరీతో చరిత్ర సృష్టించిన త్రిష
Gongadi Trisha: అండర్ 19 వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్ గా ఆమె రికార్డు క్రియేట్ చేయడం విశేషం. మంగళవారం (జనవరి 28) ఆమె ఈ ఘనత సాధించింది.
Gongadi Trisha: అండర్ 19 వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ దూకుడు కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కాట్లాండ్ అండర్ 19 టీమ్ తో మంగళవారం (జనవరి 28) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సెంచరీ బాదడంతో భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో త్రిష కేవలం 53 బంతుల్లోనే సెంచరీ చేసింది. అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా త్రిష నిలిచింది.

గొంగడి త్రిష రికార్డు సెంచరీ
అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియాలోని కౌలాలంపూర్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం (జనవరి 28) ఇండియా, స్కాట్లాండ్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో త్రిష కేవలం 59 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్ లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా త్రిష మూడంకెల స్కోరు అందుకుంది. ఈ మెగా టోర్నమెంట్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ. అంతేకాదు 110 పరుగులతో అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా త్రిష నమోదు చేసింది. గతంలో ఇంగ్లండ్ బ్యాటర్ గ్రేస్ స్క్రీవెన్స్ పేరిట 93 పరుగులతో ఈ రికార్డు ఉండేది.
త్రిష.. టాప్ ఫామ్
గొంగడి త్రిష సెంచరీతో ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ 20 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. త్రిషకు తోడు మరో ఓపెనర్ కమలిని 42 బంతుల్లోనే 51 రన్స చేసింది. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 147 పరుగులు జోడించారు.
త్రిష గతంలో అండర్ 19 వుమెన్స్ ఏషియా కప్ లోనూ ఇండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆమె ఐదు మ్యాచ్ లలో 159 రన్స్ చేసింది. దీంతో ఆ టోర్నీలో ఇండియా ఓటమి ఎరగకుండా విజేతగా నిలవడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ టాప్ స్కోరరే.
ఎవరీ గొంగడి త్రిష?
గొంగడి త్రిష మన తెలంగాణ అమ్మాయే. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డిసెంబర్ 15, 2005లో జన్మించింది. ఆమె ఓ ఆల్ రౌండర్. ప్రస్తుతం హైదరాబాద్ తరఫున అండర్ 19 క్రికెట్ లో ఆడుతోంది. తొలి అండర్ 19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్ లోనూ ఆమె సభ్యురాలిగా ఉంది. త్రిష తండ్రి ఓ ఫిట్‌నెస్ ట్రైనర్. ఆమెలోని క్రికెట్ టాలెంట్ చూసి భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చారు.
ఏడేళ్ల వయసులోనే ఆమె సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడెమీలో చేరింది. 2017-18 సీజన్లో హైదరాబాద్ సీనియర్ వుమెన్స్ టీ20 లీగ్ లో చేరింది. జనవరి 2023లో ఇండియా తరఫున తొలి అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఆడింది. ఆ టోర్నీ ఫైనల్లో ఆమె 24 పరుగులతో టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఏడు వికెట్లతో ఫైనల్ గెలిచిన ఇండియన్ టీమ్.. తొలి అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.
సంబంధిత కథనం