Glenn McGrath: పాముతో ఆటాడుకున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. వీడియో వైరల్
Glenn McGrath: పాముతో ఆటాడుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంట్లోకి వచ్చిన ఆ పామును ధైర్యంగా బయటకు విసిరేశాడు.
Glenn McGrath: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ చేసిన ఓ సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మాజీ పేస్ బౌలర్ ప్రత్యర్థి బ్యాటర్లను బయటపెట్టడమే కాదు.. తన ఇంట్లోకి వచ్చిన మూడు పైథాన్లనూ భయపెట్టాడు. అందులో ఒకదాని తోక పట్టుకొని బయటకు విసిరేయడం విశేషం. ఈ వీడియోను అతడే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
తన ఇంట్లోకి వచ్చిన మూడు చిన్న కొండచిలువలను మెక్‌గ్రాత్ సులువుగా పట్టేసుకున్న తీరు అభిమానులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ పైథాన్ తరచూ తనవైపు దూసుకొచ్చి భయపెడుతున్నా.. మెక్‌గ్రాత్ ఏమాత్రం భయపడకుండా దాని తోక పట్టుకొని జాగ్రత్తగా ఇంటి బయటకు తీసుకెళ్లాడు. ఆ వీడియో తీసిన అతని భార్య భయంతో అరవడం వీడియోలో వినొచ్చు.
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. "సారా లియోన్ మెక్‌గ్రాత్ అందించిన ప్రోత్సాహం, మద్దతుతో మూడు కోస్టల్ కార్పెట్ పైథాన్ లను విజయవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి పొదల్లోకి విసిరేశాను" అని మెక్‌గ్రాత్ సరదా క్యాప్షన్ ఉంచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెక్‌గ్రాత్ క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు.. పాములు పట్టడంలోనూ ఎక్స్‌పర్టే అంటూ కొందరు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ప్రపంచానికి అందించిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఒకడు. వరుసగా మూడు వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ లో అతడు సభ్యుడు. 1999, 2003, 2007లలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో మెక్‌గ్రాత్ ది కీలకపాత్ర. ఇప్పుడు 2023 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు మెక్‌గ్రాత్ తనలోని మరో యాంగిల్ కూడా అభిమానులకు చూపించాడు.
ఇక 2023 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే తమ టీమ్ ను అనౌన్స్ చేసింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోకున్నా ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లకు ఈ జట్టులో చోటు దక్కింది. వీళ్లతోపాటు డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ లాంటి ప్లేయర్స్ తో ఆస్ట్రేలియా చాలా బలంగా కనిపిస్తోంది.