Glenn Maxwell Catch: బౌండరీ దగ్గర కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్.. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో..
Glenn Maxwell Catch: గ్లెన్ మ్యాక్స్‌వెల్ సూపర్ మ్యాన్ ను తలపిస్తూ బౌండరీ దగ్గర పట్టిన క్యాచ్ వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అద్భుతమే చేశాడు.
Glenn Maxwell Catch: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అతడు బౌండరీ దగ్గర గాల్లోకి ఎగురుతూ చేసిన విన్యాసం చూసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న మ్యాక్స్‌వెల్ ఒంటి చేత్తో ఈ అద్భుతం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో భాగంగా బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య బుధవారం (జనవరి 1) జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్‌వెల్ ఈ క్యాచ్ అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడుతున్న విల్ ప్రెస్ట్‌విడ్జ్ కొట్టిన భారీ షాట్ కచ్చితంగా సిక్స్ వెళ్తుందని అందరూ భావించారు.
కానీ లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బౌండరీ అవతల పడబోతున్న బంతిని పట్టుకొని బౌండరీ లోపలికి విసిరాడు. ఆ తర్వాత తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ బౌండరీ ఇవతలికి వచ్చి ఆ క్యాచ్ పూర్తి చేశాడు. ఈ అద్భుతమైన క్యాచ్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. గతంలోనూ ఎన్నోసార్లు తన ఫీల్డింగ్ విన్యాసాలతో అదరగొట్టిన మ్యాక్సీ.. ఈ తాజా క్యాచ్ తో మరో లెవెల్ కు వెళ్లాడు.
మెల్‌బోర్న్ స్టార్స్ విజయం
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 రన్స్ చేసింది. అయితే ఆ తర్వాత ఆ టార్గెట్ ను మెల్‌బోర్న్ స్టార్స్ కాస్త కష్టంగానే అయినా చేజ్ చేసింది. చేజింగ్ లో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. మార్కస్ స్టాయినిస్ చెలరేగిపోయాడు.
ఈ టీమ్ కెప్టెన్ అయిన స్టాయినిస్.. డాన్ లారెన్స్ తో కలిసి నాలుగో వికెట్ కు 84 బంతుల్లోనే 132 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. అతడు 48 బంతుల్లో 62 రన్స్ చేశాడు. అటు లారెన్స్ 38 బంతుల్లోనే 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫీల్డింగ్ లో స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ లో మాత్రం తుస్సుమనిపించాడు. అతడు తొలి బంతికే డకౌటయ్యాడు.