Team India: గంభీర్ కావాలన్న వాటికి నో చెప్పిన రోహిత్ శర్మ.. సెలెక్షన్‍లో ఈ 2 విషయాల్లో భేదాభిప్రాయాలు!
Team India - Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వెల్లడైంది. 15 మంది ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ అడిగిన రెండు విషయాలను రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ అంగీకరించలేదనే విషయం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపికైంది. ఆ టోర్నీతో పాటు అంతకంటే ముందు ఇంగ్లండ్‍తో జరిగే మూడు వన్డేల సిరీస్‍కు కూడా అదే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును శనివారం (జనవరి 19) ప్రకటించారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. జట్టును ప్రకటించే ముందు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమావేశం అయ్యారు. చాలాసేపు చర్చించారు. దీంతో షెడ్యూల్ ప్రకారం జట్టును మధ్యాహ్నం ప్రకటించాల్సి ఉండగా.. సాయంత్రం అయింది. మీడియా సమావేశంలో అగార్కర్, రోహిత్ శర్మ పాల్గొన్నారు. జట్టును ప్రకటించారు. అయితే, సెలెక్షన్ విషయంలో గౌతమ్ గంభీర్ అడిగిన కొన్ని విషయాలను రోహిత్, అగార్కర్ అంగీకరంచలేదనే సమాచారం బయటికి వచ్చింది.
శాంసన్‍ను అడిగిన గౌతీ.. నో చెప్పిన రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టు విషయంలో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, అగార్కర్ మధ్య పూర్తిగా ఏకాభిప్రాయం రాలేదు. జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కాకుండా సంజూ శాంసన్ ఉండాలని గంభీర్ అడిగాడని దైనిక్ జాగరణ్ రిపోర్ట్ పేర్కొంది. అయితే, రోహిత్ శర్మ, అగార్కర్ మాత్రం పంత్ ఉండాలని చెప్పారట. శాంసన్‍కు నో చెప్పేశారని తెలుస్తోంది. దీంతో పంతే చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
సంజూ శాంసన్ ఇటీవల దేశవాళీ వన్డే ట్రోర్నీ విజయ్ హాజారే ట్రోఫీకి డుమ్మా కొట్టాడు. ఇది సెలెక్టర్లకు నిరాశ కలిగించింది తెలుస్తోంది. కాగా, పంత్ గత రెండేళ్లలో ఒకే వన్డే ఆడాడు. రోడ్డు ప్రమాదంలో అయిన గాయాల నుంచి కోలుకున్నాక శ్రీలంకతో ఓ వన్డే ఆడాడు. కానీ, అంతకు ముందు పర్ఫార్మెన్స్ పరిగణనలోకి తీసుకొని పంత్‍కే సెలెక్టర్లు ఓటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ అతడికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉంటాడు.
వైస్ కెప్టెన్ విషయంలోనూ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‍గా ఉండాలని గౌతమ్ గంభీర్ అడిగాడట. గాయం వల్ల బుమ్రా ఈ టోర్నీ ఆడడం అనుమానం కావటంతో హార్దిక్‍ను వైస్ కెప్టెన్ చేద్దామని చెప్పాడని సమాచారం. ఈ అంశాన్ని రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ అంగీకరించలేదని ఆ రిపోర్ట్ వెల్లడించింది. శుభ్‍మన్ గిల్‍ను వైస్ కెప్టెన్ చేద్దామని వారిద్దరూ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరి అభిప్రాయం మేరకు గిల్ వైస్ కెప్టెన్ అయ్యాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‍ల్లో భారత వన్డే జట్టుకు గతంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. 2023 వన్డే ప్రపంచచకప్‍లోనూ వైస్ కెప్టెన్‍గానే ఉన్నాడు. ఆ తర్వాత గాయం బారిన పడటంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు గిల్‍ను వైస్ కెప్టెన్ చేశారు సెలెక్టర్లు. దీంతో ఇక హార్దిక్‍కు భవిష్యత్తులోనూ కెప్టెన్సీ ఆశలు ఇక లేనట్టే.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య ఇంగ్లండ్‍తో మూడు వన్డేల సిరీస్‍ను టీమిండియా ఆడనుంది. రెండింటికి 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఒకవేళ వన్డే సిరీస్‍కు బుమ్రా సిద్ధం కాకపోతే హర్షిత్ రాణా జట్టులోకి వస్తాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ
సంబంధిత కథనం