Gautam Gambhir: మైదానంలోనే మోర్కెల్‍పై అరిచిన గంభీర్.. సిరీస్ అంతా ముభావంగానే!
Gautam Gambhir: ఆస్ట్రేలియా పర్యటనలో మోర్న్ మోర్కెల్‍పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా అరిచాడని విషయం బయటికి వచ్చింది. మైదానంలోనే గంభీర్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఆ వివరాలు ఇవే..
ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఓడిపోడంతో చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. ఆ పర్యటనలో జరిగిన కొన్ని అంశాలు క్రమంగా వెల్లడవుతున్నాయి. ఈ టెస్టు సిరీస్ సమయంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మార్న్ మోర్కెల్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది. మైదానంలోనే మోర్కెల్‍పై గంభీర్ అరిచాడని తెలుస్తోంది. ఈ పంచాయితీ బీసీసీఐ వరకు వెళ్లిందట.
కారణం ఇదే
ఓ పర్సనల్ మీటింగ్‍కు వెళ్లిన మార్న్ మోర్కెల్ ట్రైనింగ్ సెషన్‍కు ఆలస్యంగా రావటంతో గౌతమ్ గంభీర్ అరిచాడని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. దీంతో సిరీస్ అంతా ఇద్దరూ ముభావంగానే ఉన్నారని పేర్కొంది. “క్రమశిక్షణ విషయంలో గంభీర్ చాలా కఠినంగా ఉంటాడు. మైదానంలోనే వెంటనే మార్కెట్‍పై అరిచేశాడు. ఈ పర్యటనలో కాస్త పక్కనే ఉండాలని మోర్కెల్‍కు బీసీసీఐ సూచించింది. ఇది పరిష్కరించుకోవడం వారి చేతుల్లోనే ఉంది” అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.
హెడ్ కోచ్‍గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గౌతమ్ గంభీర్.. ఏరికోరి బౌలింగ్ కోచ్‍గా దక్షిణాఫ్రికా స్టార్ మార్న్ మోర్కెల్‍ను తెచ్చుకున్నాడు. తొలుత బీసీసీఐ కాస్త అభ్యంతరం తెలిపినా గౌతీ పట్టుపట్టాడని అప్పట్లో సమాచారం బయటికి వచ్చింది. దీంతో బౌలింగ్ కోచ్‍గా మోర్కెల్‍కు బీసీసీఐ ఓకే చెప్పిందని సమాచారం. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో మోర్కెల్‍పైనే గౌతీ అరిచాడని తెలుస్తోంది. ఈ పరిస్థితిని బీసీసీఐ పరిశీలిస్తోందని ఆ రిపోర్ట్ పేర్కొంది.
సపోర్టింగ్ స్టాఫ్‍పై బీసీసీఐ దృష్టి
టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం పర్ఫార్మెన్స్‌పై బీసీసీఐ ప్రస్తుతం దృష్టి సారించింది. వారి పనితనం గురించి సీనియర్ ప్లేయర్లను అడగనుంది. ముఖ్యంగా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌పై ఎక్కువ పరిశీనల చేయనుందని తెలుస్తోంది. టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఎక్కువసార్లు ఒకేలా ఔట్ అవుతున్నాడని, ఈ విషయంలో అభిషేక్ నాయర్ ఏం చేస్తున్నారని దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ప్రశ్నించారు. దీన్ని బీసీసీఐ సీరియస్‍గా తీసుకుంది.
అభిషేక్ నాయర్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‍డెస్కాటేపై కూడా బీసీసీఐ అంత హ్యాపీగా లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్న అతడి వల్ల టీమిండియాకు ఏమైనా లాభదాయకంగా ఉందా అనే విషయాన్ని ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఈ తరుణంలో కోచింగ్ స్టాఫ్ పదవీ కాలాన్ని మూడు నుంచి రెండేళ్లకు తగ్గించాలనే ఆలోచన కూడా చేస్తోందని సమాచారం.
బీజీటీ సిరీస్‍లో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో ఓటమి పాలైంది టీమిండియా. అంతకు ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో భారత్ టెస్టు సిరీస్‍లో క్లీన్‍స్వీప్ అవడం అదే తొలిసారి. ఇలా వరుస పరాభవాలు రావడంతో బీసీసీఐ సీరియస్‍గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విఫలమైతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు వేసేందుకు కూడా బీసీసీఐ రెడీ అవుతుందనే రూమర్లు కూడా వస్తున్నాయి. మరోవైపు ఆసీస్ పర్యటనలో వైఫల్యంపై గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో ఇటీవలే బీసీసీఐ సమీక్ష కూడా నిర్వహించింది.
సంబంధిత కథనం