Gautham Gambhir: గంభీర్ ఏం సాధించాడని.. అతడెప్పుడూ చెప్పేది చేయడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Gautham Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. అతడో కపటం ఉన్న మనిషి అని, చెప్పేది ఎప్పుడూ చేయడని అనడం గమనార్హం. గంభీర్ ఏమీ ఒంటిచేత్తో కేకేఆర్ కు ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్టలేదని అన్నాడు.
Gautham Gambhir: గౌతమ్ గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. అతనితో కలిసి కేకేఆర్ టీమ్ లో ఆడిన తివారీ.. గంభీర్ ఎప్పటికీ రోహిత్ శర్మతో కలిసి పని చేయలేడని అన్నాడు. అతడో కపటం కలిగిన వ్యక్తి అని, చెప్పేది ఎప్పుడూ చేయడని కూడా అన్నాడు. అసలు బౌలింగ్ కోచ్ అవసరం ఏంటని, అతడు కూడా హెడ్ కోచ్ చెప్పిందే చేస్తాడు కదా అని కూడా తివారీ ప్రశ్నించాడు.
గంభీర్ ఎప్పుడూ చెప్పేది చేయడు
మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ న్యూస్ 18 బంగ్లాతో మాట్లాడుతూ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పై విరుచుకుపడ్డాడు. సీనియర్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనాను ఎందుకు ఇండియన్ టెస్ట్ టీమ్ లోకి తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. "గౌతమ్ గంభీర్ ఓ కపటమైన వ్యక్తి. ఎప్పుడూ తాను చెప్పేది చేయడు. కెప్టెన్ (రోహిత్) ముంబైకి చెందినవాడు. అభిషేక్ నాయర్ కూడా ముంబైకి చెందినవాడే. రోహిత్ ను ముందుకు తోశారు. జలజ్ సక్సేనా కోసం ఎవరూ మాట్లాడేవాళ్లే లేరు. అతడు బాగా ఆడినా సైలెంట్ గా ఉంటాడు" అని మనోజ్ తివారీ అన్నాడు.
"వాళ్లిద్దరూ ఎలా కలిసి పని చేస్తారు? రోహిత్ ఓ వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్. గంభీర్ కెప్టెన్, మెంటార్ గా కేకేఆర్ కు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. గంభీర్ ఒంటిచేత్తో ఏమీ గెలిపించలేదు. మేమందరం బాగా ఆడాం. కలిస్, నరైన్, నేను కూడా విజయంలో కీలకపాత్ర పోషించాం. కానీ క్రెడిట్ ఎవరికి దక్కింది? పీఆర్ కారణంగా క్రెడిట్ అంతా అతనికే దక్కింది" అని తివారీ అన్నాడు.
బౌలింగ్ కోచ్ ఎందుకు?
గంభీర్ కింద పని చేస్తున్న అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఎప్పుడూ అతని ఆదేశాలను ఉల్లంఘించరని అన్నాడు. "బౌలింగ్ కోచ్ అవసరం ఏంటి? కోచ్ ఏమి చెప్పినా అతడు ఓకే అంటాడు. మోర్నీ మోర్కెల్ లక్నీ సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. అభిషేక్ నాయర్ కేకేఆర్ లో గంభీర్ తో కలిసి ఉండేవాడు. వాళ్లు తన ఆదేశాలను ఉల్లంఘించరని హెడ్ కోచ్ తెలుసు" అని తివారీ అన్నాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాడు. అయితే అతడు వచ్చిన తర్వాత ఇండియాకు అవమానకరమైన ఓటములు ఎదురయ్యాయి. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి, స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఓటమి, పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడంలాంటివి జరిగాయి.