Gautham Gambhir: ప్లేయర్‌గా హిట్.. కోచ్‌గా ఢమాల్.. గంభీర్ కోచింగ్‌లో టీమిండియాకు అవమానకరమైన ఓటములు
Gautham Gambhir: గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ విజయాల కంటే అవమానకర ఓటములే ఎక్కువగా ఉంటున్నాయి. ఓ ప్లేయర్ గా రెండు వరల్డ్ కప్ లు గెలిచిన జట్లలో సభ్యుడైన అతడు.. కోచ్ గా మాత్రం విఫలమవుతున్నాడు.
Gautham Gambhir: గౌతమ్ గంభీర్.. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ప్లేయర్. ఆ రెండు మెగా టోర్నీల ఫైనల్స్ లోనూ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నా చాలనుకుంటారు చాలా మంది. కానీ గంభీర్ ఓ ప్లేయర్ గా రెండు వరల్డ్ కప్ సాధించాడు. అయితే ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.
గంభీర్.. కోచ్‌గా విఫలం
గౌతమ్ గంభీర్ గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి వరకూ ఆ పదవిలో రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఆ వరల్డ్ కప్ విజయంతో అతని కాంట్రాక్టు ముగిసింది. ఐపీఎల్లో కెప్టెన్ గా, మెంటార్ గా కేకేఆర్ కు మూడుసార్లు ట్రోఫీ అందించిన గంభీర్.. టీమిండియాకు అదే సక్సెస్ అందిస్తాడని చాలా మంది ఆశ పడ్డారు.
కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత శ్రీలంకలో 27 ఏళ్ల తర్వాత ఓ వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయింది. మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతుల్లో 0-3తో వైట్ వాష్ అయింది. ఇక ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పోయింది.
పదేళ్ల తర్వాత కంగారూలు మళ్లీ ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. గత రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియా గడ్డపై సంచలనాలు క్రియేట్ చేసిన ఇండియన్ టీమ్.. ఈసారి గంభీర్ కోచింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గెలవాల్సిన, డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ లలో ఓటములు మింగుడు పడటం లేదు.
అసలు ప్లానింగ్ ఉందా?
హెడ్ కోచ్ గా గంభీర్ కు అసలు టీమ్ ను ఎలా ముందుకు నడిపించాలన్న ప్లానింగ్ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి ఆవేశం తప్ప ఆలోచన లేదని అభిమానులు విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్లకు అసలు అవకాశాలు ఇవ్వకపోవడం, చివరిదైన సిడ్నీ టెస్టులో పేసర్ కు బదులు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
సిరీస్ మధ్యలోనే అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్ రిటైరవడం, జట్టులో లుకలుకలున్నాయన్న వార్తలు, సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లి భవిష్యత్తుపై సందిగ్ధత.. ఇలా గంభీర్ కోచ్ అయిన తర్వాత అన్నీ ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. గతేడాది టీ20ల్లో తప్ప మిగిలిన ఫార్మాట్లలో టీమ్ సక్సెసైంది లేదు. చివరి 8 టెస్టుల్లో కేవలం ఒకే ఒక్కదాంట్లో గెలిచి, ఆరు ఓడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది.
ఇక వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో గంభీర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? బుమ్రాకు సరైన జోడీని అతడు కనుగొంటాడా? జట్టులోని సీనియర్లను గాడిన పెడతాడా? జట్టులోని విభేదాలను పరిష్కరించి మళ్లీ గెలుపు బాట పట్టిస్తాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి వీటికి గంభీర్ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.