Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లపై గట్టిగా అరిచిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్!
Gautam Gambhir: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓడిపోయింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహనం కోల్పోయి.. ఆటగాళ్లపై అరిచేశాడట. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం బయటికి వచ్చింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. మెల్‍బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి రోజు డ్రా ఖాయమనుకున్న దశలో భారత జట్టు కుప్పకూలింది. అనూహ్యంగా పరాజయం చవిచూసింది. మ్యాచ్ ఆఖరి రోజు చివరి సెషన్‍లో చివరి 34 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. 340 పరుగుల లక్ష్యఛేదనలో కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. 184 పరుగుల తేడాతో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయి ఐదు టెస్టుల సిరీస్‍లో సిరీస్‍లో 1-2తో వెనుకంజలోకి వెళ్లిపోయింది. నాలుగో టెస్టులో అనూహ్య ఓటమి తర్వాత సహనం కోల్పోయి డ్రెస్సింగ్ రూమ్‍లో అరిచేశాడట హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్.
టీ విరామ సమయానికి భారత్ మూడు వికెట్లే కోల్పోయింది. రెండో సెషన్‍లో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్. దీంతో చివరి సెషన్‍లోనూ నిలకడగా ఆడి భారత్ ఈ మ్యాచ్ డ్రా చేసుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఆస్ట్రేలియా కూడా పార్ట్ టైమ్ బౌలర్లతో ప్రయోగాలు చేసింది. ఈ తరుణంలో రిషబ్ పంత్ ఓ అనవసరమైన చెత్త షాట్ కొట్టి ఔటయ్యాడు. యశస్వి కూడా థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బ్యాటర్లు టపటపా ఔటయ్యారు. దీంతో టీమిండియాకు అనుకోని ఓటమి ఎదురైంది. దీంతో గంభీర్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది.
ఇక చాలు అంటూ..
గతేడాది కూడా కొన్ని మ్యాచ్‍ల్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో ఓటములు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాతోనూ నాలుగో టెస్టులో అలాగే జరిగింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‍లో ఆటగాళ్లపై గంభీర్ అరిచాడట. చాలా అయింది.. ఇక చాలు (బహుత్ హోగయా) అని గౌతీ గట్టిగా అరిచాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది.
డ్రెస్సింగ్ రూమ్‍లో మొత్తం ఆటగాళ్లు ఉన్న సమయంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడట గంభీర్. “20.4 ఓవర్ల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి మెల్‍బోర్న్ టెస్టును ఆస్ట్రేలియాకు సమర్పించుకున్నాక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొత్తం జట్టుతో గట్టిగా మాట్లాడాడు. ఘాటైన పదాలు వాడాడు” అని ఆ రిపోర్ట్ పేర్కొంది.
పేర్లు ఎత్తకుండానే..
ఏ ఆటగాళ్ల పేరు తీయకుండానే జట్టు మొత్తంపై గంభీర్ అసంతృప్తితో మాట్లాడాడని సమాచారం. తాను చెప్పిన విషయాలు కాదని ఇష్టమొచ్చినట్టు ఆడారని అన్నాడట. జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది. జట్టు మొత్తానికి గౌతీ గట్టి క్లాస్ తీసుకున్నాడని సమాచారం.
వరుస పరాభవాలు
గతేడాది టీ20 ప్రపంచకప్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత జట్టు హెడ్‍కోచ్‍గా రాహుల్ ద్రవిడ్ దిగిపోగా.. ఆ స్థానంలోకి జూలైలో గౌతమ్ గంభీర్ వచ్చాడు. గంభీర్ వచ్చాక టీమిండియాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. చాలా ఏళ్ల తర్వాత స్వదేశంలో లంకపై భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో టీమిండియా 0-3తో క్లీన్ స్వీప్ అయింది. స్వదేశంలో టెస్టు సిరీస్‍లో వైట్‍వాష్ అవడం భారత్‍కు చరిత్రలో ఇదేతొలిసారి. ఇలా వరుస పరాభవాలు వచ్చాయి. బుమ్రా నేతృత్వంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో తొలి మ్యాచ్ గెలిచింది భారత్. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో డే నైట్ టెస్ట్ ఓడింది. మూడో టెస్టు డ్రా అయినా.. నాలుగో టెస్టులో అనూహ్యంగా ఓడింది. టెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్ అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో ఐదో టెస్టు జరగనుంది. జనవరి 3న ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‍ను భారత్ గెలిస్తే 2-2తో సిరీస్ సమం చేసుకోవచ్చు. ఓడినా, డ్రా చేసుకున్నా.. సిరీస్ కోల్పోవటంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‍షిప్ 2025 ఫైనల్ ఆశలు పూర్తిగా ముగిసిపోతాయి.
సంబంధిత కథనం